
బ్యాంకు దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
రాయచోటి : బ్యాంకులలో దొంగల నుంచి వినియోగదారులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించే విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లాలోని బ్యాంక్ అధికారులను జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. బ్యాంకుల భద్రతా ప్రమాణాలపై జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యాంకులలో దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు, బ్యాంకులలో సీసీ కెమెరాల వినియోగంపై ఆరా తీశారు. సీసీ కెమెరాలు రికార్డు అయ్యే దృశ్యం స్పష్టంగా కనపడేలా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు, క్యాష్ కౌంటర్లు, ఏటీఎంలు, లాబీలు అన్నింటినీ కవర్ చేసే విధంగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. నగదు రవాణా సమయంలో శిక్షణ పొందిన లైసెన్సు కల్గిన ఆయుధం ఉన్న గార్డులను నియమించాలన్నారు. బ్యాంకు అనుసంధానంగా పనిచేసే గార్డు నుండి సిబ్బంది వరకు వారి వివరాలు తెలిసి ఉండాలని సూచించారు. ప్రతి బ్యాంకులో కూడా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులో ఏదైనా జరిగేతే అలారం పోలీసు స్టేషన్‌లో మోగేలా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బ్యాంకులోని ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ సిబ్బందిపై పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరిగా జరిపించాలన్నారు. బ్యాంకు పరిసరాలలో ముఖ్యంగా రాత్రిపూట సరైన వెలుతురు ఉండేలా చూడాలన్నారు. అత్యవసర కాల్ నెంబర్లు, హెల్ప్‌లైన్ నెంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ప్రతి ఖాతాదారుడి లావాదేవీలను అప్రమత్తంగా గమనిస్తూ ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్ల మీద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఓటీపీల గురించి ఖాతాదారులను హెచ్చరించాలన్నారు. బ్యాంకులలో అపరిచిత వ్యక్తులను గమనించినప్పుడు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. సీసీ కెమెరాల రికార్డు దృశ్యాన్ని కనీసం ఆరు నెలలు నిల్వ ఉండేలా భద్రంగా చూసుకోవాలన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను పోలీసు వారు అడిగినప్పుడు వెంటనే అందించేలా పోలీసులకు సహకరించాలన్నారు. బ్యాంకులోకి వచ్చిన ఖాతాదారులను హెచ్చరిస్తూ మోసాల గురించి తెలియజేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని ప్రదేశాలలో దొంగతనాలు జరిగిన సీసీ టీవీ దృశ్యాలను బ్యాంకర్లకు ఐటీకోర్ టీమ్ సిబ్బంది స్క్రీన్ మీద చూపించారు. జిల్లాలోని పోలీసు అధికారులు బ్యాంకులను సందర్శించి సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బ్యాంకు అధికారులతో మాట్లాడాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని బ్యాంకుల దగ్గరకు పెట్రోలింగ్ సిబ్బంది వెళ్లి పాయింట్ బుక్‌ను తనిఖీ చేసేలా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎం.వెంకటాద్రి, జిల్లా బ్యాంకర్ల ఎల్‌డీఎం ఆంజనేయులు, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ మల్లేశ్వరరావు, జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాజా రమేష్, సైబర్ సెల్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ జోసెఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్థిక మోసాలను
నివారించేలా చర్యలు
భద్రతా ప్రమాణాలపై
బ్యాంకర్లతో జిల్లా ఎస్పీ సమీక్ష