
తెలుగు తమ్ముళ్ల ఘర్షణ
సుండుపల్లె : మండల పరిధిలోని జి.రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీలో భూ ఆక్రమణపై టీడీపీలోని ఇరువర్గాల నాయకుల మధ్య వివాదం చెలరేగింది. బుధవారం ఆక్రమిత స్థలం వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. అసభ్య పదజాలాలతో దూషించుకుంటూ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఇదంతా చూస్తున్న రెవెన్యూ అధికారులు ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. వివరాలు ఇలా.. మండల పరిధిలోని జి.రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీ కోనంకివాండ్లపల్లె సమీపంలో సర్వే నెంబర్ 731–4లో 0.73 సెంట్లు ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన మేడా వర్గీయుడు అరుణ్‌కుమార్ ఆక్రమించాడని జగన్‌మోహన్‌రాజు వర్గీయులు ఆంజనేయులు నాయుడు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై బుధవారం రెవెన్యూ అధికారులు ఆక్రమిత స్థలం వద్దకు పరిశీలనకు వచ్చారు. అయితే అక్కడికి ఫిర్యాదు చేసిన వారు కూడా రావడంతో ఇరువర్గాలు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ గొడవపడ్డారు. జగన్‌మోహన్‌రాజు వర్గానికి చెందిన కనికలపాటి ఆంజనేయులు తనను జొన్నల అరుణ్‌కుమార్, వెంకటరమణ, ఉగ్గారపు శివకుమార్ అసభ్యకరంగా దూషించి కొట్టారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏఎస్‌ఐ అయూబ్‌ఖాన్ కేసు నమోదు చేశారు.