
బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
రాజంపేట : రైల్వేకోడూరులో బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధరల కల్పించే విషయంలో సిండికేట్లు వెనక్కి తగ్గడం లేదంటూ బుధవారం రాజంపేట సబ్‌కలెక్టర్ వైఖోమానైదియాదేవికి రైతు సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టరేట్‌లో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్, రైతు సంఘం జిల్లానేత పందికాళ్ల మణి మాట్లాడుతూ రైల్వేకోడూరు బొప్పాయి వ్యాపారులు,సేట్లు సిండికేట్ కావడంతో బొప్పాయి రైతులకు ధర తగ్గిస్తున్నారన్నారు. కోట్లలో వ్యాపారం చేస్తున్న వారికి ఎలాంటి ౖలైసెన్స్‌లు లేవన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. టన్నుపై రైతు లక్షన్నర నష్టపోతున్నాడన్నారు. మరో వైపు 1000 కేజిలకు 100 కేజిలు సూటు పేరుతో రైతును దగా చేస్తున్నారన్నారు. కిలో రూ.25 ధర కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. రెండు రోజుల్లో బొప్పాయి రైతుల ధరల సమస్య పరిష్కరిస్తామని సబ్‌కలెక్టర్ వైఖోమా నైదియాదేవి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతు నేతలు ఆదినారాయణ, తుంగ శివకృష్ణ, మన్నూరు విశ్వనాథరెడ్డి, తిరుమల చరణ్, ఈర్ల ఈశ్వరయ్య, ప్రేమ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.