
నామినేషన్లకు ముందే బెదిరింపులు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున నామినేషన్ వేసిన వారిని తుదముట్టిస్తామంటూ మంగళవారం స్థానిక హరితా హోటల్‌లో విలేకరుల సమావేశంలో రాజంపేట టీడీపీ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ఇంకా నామినేషన్లు వేయక ముందే అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడంపై మండల ప్రజలు మండిపడుతున్నారు. తమకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసేందుకు గానీ, పోటీ చేసేందుకు గానీ భయపడే విధంగా టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతుండటం రౌడీ రాజకీయాన్ని తలపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. దమ్ముంటే పోటీ చేయండి అంటూ మీసాలు మెలివేయడం, తుదముట్టిస్తామని బెదిరించడం లాంటి టీడీపీ నేతల వైఖరి చూస్తుంటే ఒంటిమిట్ట ఉప ఎన్నిక సజావుగా జరిగేనా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన..
మండల పరిధిలోని కొండమాచుపల్లి గ్రామంలో ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా తెలుగుదేశం జెండా ఎగురుతోంది. ఇది చూసిన కొంత మంది ఇతర రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజలు అధికార పార్టీ జెండా అని అధికారులు పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని సంబంధిత ఎన్నికల అధికారిని ప్రజలు కోరుతున్నారు.

నామినేషన్లకు ముందే బెదిరింపులు