
టెండర్లు లేకుండానే భూకేటాయింపులా.?
మదనపల్లె రూరల్ : అత్యంత విలువైన భూములను టెండర్లు లేకుండా, నిబంధనలు పాటించకుండా పప్పుబెల్లాలు మాదిరిగా కూటమి ప్రభుత్వం కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు సంతర్పణ చేయడమేంటని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కొన్నాళ్లుగా కూటమిప్ర భుత్వం అడ్డగోలుగా చేస్తున్న భూ పందేరాలపై, ఆయా సంస్థల ప్రతినిధులతో ప్రభుత్వ పెద్దలు చేసుకున్న లోపాయికారి ఒప్పందాలను ప్రజల ముందు బహిర్గతం చేయాలన్నారు. కార్పొరేట్ సంస్థలు, సూపర్ మార్కెట్ సంస్థకు విలువైన ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. వైజాగ్, విజయవాడలో దుబాయ్ సంస్థ లులూ గ్రూప్ ఏర్పాటు చేస్తున్న భారీ మాల్‌కు తక్కువ ధరలకు భూములు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు కక్షసాధింపులు, మరోవైపు ప్రభుత్వ భూములు బినామీలకు కారుచౌకగా అప్పగించి తద్వారా జేబులు నింపుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విజయవాడలో పాతబస్టాండుగా పిలుచుకునే గవర్నర్‌పేట ఆర్టీసీ డిపోకు చెందిన రూ.600 కోట్ల విలువైన 4.15 ఎకరాల భూమిని, రూ.156 కోట్ల పెట్టుబడి కోసం 99 సంవత్సరాల కాలపరిమితికి లీజు విధానంలో అప్పగించడం హాస్యాస్పదమన్నారు. కేరళ, హైదరాబాద్‌లో మాల్స్ నిర్మించిన లులుకు ఎక్కడా ప్రభుత్వ భూములు కేటాయించలేదన్నారు. అలాంటి లులుకు చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను కారుచౌకగా అప్పగించడం వెనుక ఏ ప్రయోజనాలున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
అడ్డగోలు భూకేటాయింపులపై
నిసార్‌అహ్మద్ ఆగ్రహం