
వైభవంగా ఈశ్వరీదేవి జయంత్యుత్సవం
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం మండలంలోని ఈశ్వరీదేవి మఠంలో ఈశ్వరీదేవి జయంత్యుత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. ఈశ్వరీ మాత సేవా సమితి ట్రస్ట్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ ఆధ్వర్యంలో మహిళా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సమర్పించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన, హోమాలు నిర్వహించారు. ఇందులో మఠాధిపతి వీరశివకుమారస్వామి, రాజరాజేశ్వరిదేవి దంపతులు, మహిళా భక్తులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఊరేగింపు
అష్టోత్తర(108) కలశాలతో భక్తజనం ఊరేగింపు ఆకట్టుకుంది. తర్వాత గుడి ఉత్సవం కమనీయంగా జరిగింది. మధ్యాహ్నం నైవేద్యం, మంత్ర పుష్పం, నీరాజనం, తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి గ్రామోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. మఠాధిపతి వీరశివకుమారస్వామి ఆధ్వర్యంలో ఆలయ ఈఓ బీవీ జగన్‌మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో దేవదాయశాఖ అధికారులు, అమ్మవారి శిష్య బృందం ఏర్పాట్లు చేశారు.