
అంకెలు రాస్తే..డబ్బులా..!!
కురబలకోట : అంకెలు రాస్తే.. డబ్బులా.. ఇదేమిటబ్బా.. ఆ రాతలను ఏం చేసుకుంటారు..ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి కొత్త తరహా మోసాలే ఇపుడు బయటపడుతున్నాయి. డేటా ఎంట్రీ, వర్క్ ఫ్రమ్ హోం పేర్లతో అన్నమయ్య జిల్లాలోని అంగళ్లులో ఎలైట్ క్రూవ్స్ డేటా సొల్యూషన్స్ మోసాలపై బుధవారం వందలాది మహిళలు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఇప్పటికే 600 మంది బాధితులను వివిధ ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటుచేసి పేర్లు, చిరునామా మార్చి మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడవుతోంది. న్యాయం కోసం అంగళ్లు ఓపీ స్టేషన్ ఎదుట మహిళలు నిరసన చేపట్టిన నేపథ్యంలో ప్రధాన నిందితుడు వినోద్‌కుమార్ కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ప్రత్యేక టీమ్ ఏర్పాటుచేసి అతడి కోసం గాలిస్తున్నట్లు రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ గురువారం తెలిపారు. మోసం చేసిన డబ్బుతో ఆస్తులు కొని ఉంటే ఆర్‌ఆర్ యాక్టు కింద స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. వివిధ ప్రాంతాల్లో మూడు వేల మంది దాకా బాధితులు ఉండవచ్చని సిబ్బంది చెబుతున్నారన్నారు. రూ.3 వేల చొప్పున చెల్లించి ఈ సభ్యత్వం తీసుకున్నారని, ఆ నెలలో ఎన్ని పేపర్లలో అంకెలు రాస్తే అంత డబ్బు ఇస్తామని నిర్వాహకులు చెప్పినట్లు వివరించారు. కొత్త వారిని జాయిన్ చేయిస్తే రూ.వెయ్యి నగదు ప్రోత్సాహం ఉండడంతో పోటీలు పడీ మరీ ఇందులో చేర్పించారని తెలిపారు. ఎక్కువగా మదనపల్లె పరిసర ప్రాంతాలకు చెందిన వారు బాధితులుగా ఉన్నారు. అంకెలు రాసిన ఫారాలను నిర్వాహకులు వేర్ హౌస్‌లను పంపేవారని సమాచారం.
ఎలైట్ క్రూవ్స్ డేటాపై సమగ్ర విచారణ
పరారీలో ఉన్న నిర్వాహకుడి కోసం వేట

అంకెలు రాస్తే..డబ్బులా..!!