
రుణదాతల ఒత్తిడి..ఇద్దరు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : రుణదాతల ఒత్తిడి భరించలేక ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గురువారం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని పెంచుపాడు పంచాయతీ పాశంవారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు కే.సురేష్(34) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్థానికుడు జయన్న వద్ద రూ.2 లక్షలు కుటుంబ అవసరాల కోసం అప్పు తీసుకున్నాడు. 100కి రూ.25 వడ్డీతో కొంత కాలం చెల్లించాడు. ఇదే క్రమంలో జయన్న మరికొంత నగదు సురేష్ పూచీకత్తుతో మరింతమందికి వారం, నెల కంతులకు ఇచ్చాడు. వారు తిరిగి చెల్లించక పోవడంతో ఆ డబ్బుతో కలిపి మొత్తంగా రూ.10 లక్షలు బాకీ ఉందని తక్షణమే చెల్లించాలని సురేష్‌పై అప్పిచ్చిన జయన్న ఒత్తిడి చేశాడు. దీంతో సురేష్ తన ఇంటిలోని ఆవులు అమ్మి రూ.లక్ష, వరి పంట దిగుబడి, తన ఆటో విక్రయించి రూ.1.5 లక్షలు విడతల వారీగా చెల్లించాడు. జీవనాధారం లేక కూలి పనులకు వెళుతున్నాడు. అయినా అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో భరించలేక కుటుంబాన్ని వదలి ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లిపోయాడు. అయితే జయన్న తాలూకా పోలీసులను ఆశ్రయించి సురేష్‌పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడి కుటుంబసభ్యులను విచారించి, సురేష్‌ను రప్పించాలని కోరడంతో బుధవారం రాత్రి ఇంటికి వచ్చాడు. అప్పు చెల్లించాలన్న ఒత్తిడి భరించలేక, వలసపల్లె పంచాయతీ బోయకొండ క్రాస్ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదేవిధంగా పట్టణంలోని వాల్మీకివీధికి చెందిన నరసింహులు కుమారుడు బాబు(55) స్థానికంగా అల్ల నేరేడు మండీ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యాపార అవసరాల కోసం నాలుగేళ్ల క్రితం స్థానికులైన జయమ్మ, అరుణ వద్ద రూ.7లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లింపులో భాగంగా ఇప్పటివరకూ దాదాపు రూ.12.5 లక్షలు తిరిగి చెల్లించాడు. అయితే ఇప్పటికీ రూ.7లక్షలు అసలుతో పాటు వడ్డీ చెల్లించాలని రుణదాతలు కొద్దిరోజులుగా తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఇదే క్రమంలో గురువారం సాయంత్రం అల్లనేరేడు మండీ వద్దకు జయమ్మ, అరుణ, ఆమె భర్త మోక్షిత్‌రెడ్డి వెళ్లి అప్పు చెల్లించాలని నిలదీశారు. గొడవ చేశారు. దీన్ని అవమానంగా భావించిన బాబు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయా ఘటనల్లో బాధితులను కుటుంబసభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అనంతరం బాబు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.

రుణదాతల ఒత్తిడి..ఇద్దరు ఆత్మహత్యాయత్నం