నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు

Jul 8 2025 5:24 AM | Updated on Jul 8 2025 5:24 AM

నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు

నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు

సాక్షి రాయచోటి : నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ఒక పెద్ద ముఠా గుట్టు రట్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌ల సమక్షంలో ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. నకిలీ కరెన్సీ కేసుకు సంబంధించి 10 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వాయల్పాడులోని లక్కీ బ్రాందీ షాపు మేనేజర్‌ నవీన్‌ కుమార్‌ దగ్గరకు ఈనెల 26వ తేదీన 500 రూపాయల నోటుతో మద్యం కొనేందుకు కాలేషా అనే వ్యక్తి వచ్చాడన్నారు. ఇంతకు ముందు కూడా రెండుసార్లు దొంగ నోట్లు ఇచ్చావని, తిరిగి ఇప్పుడు దొంగ నోటు తెచ్చావని అనగానే కాలేషా పారిపోయాడన్నారు. లక్కీ వైన్‌ షాప్‌ మేనేజర్‌ నవీన్‌ కుమార్‌ వెంటనే వాయల్పాడు పోలీస్‌ స్టేషన్‌లో సీఐ జె.ప్రసాద్‌ బాబుకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ నకిలీ కరెన్సీ నోట్ల ముఠా చీకటి పడగానే 500 రూపాయల నకిలీ కరెన్సీని మార్చే పనిలో ఉందన్న విషయం పసిగట్టిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారన్నారు. నకిలీ కరెన్సీ చలామణిపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా ఈ ముఠా మదనపల్లి– బెంగళూరు ప్రధాన రహదారిలో వాయల్పాడు క్రాస్‌ వద్ద గల నయారా పెట్రోల్‌ బంక్‌ దగ్గరలో ఉన్నారని వాయల్పాడు సీఐ తమ సిబ్బందితో వెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు.

10 మంది నిందితుల అరెస్టు.. సామగ్రి స్వాధీనం

నకిలీ కరెన్సీ నోట్ల చలామణి నిందితులను చుట్టుముట్టి పట్టుకుని పెద్దమనుషుల సమక్షంలో విచారించగా షేక్‌ కాలేషా వలీ ద్వారా తీగ లాగితే డొంక కదిలినట్లు తెలిపారు. ఈ ఘటనలో షేక్‌ కాలేషా వలీ అలియాస్‌ కలేసా, వీయం ముస్తాక్‌ అహమద్‌ అలియాస్‌ ముత్తు, ఎస్‌ఎండీ హఫీజ్‌, భీమసింగ్‌ పండిట్‌ రాథోడ్‌ అలియాస్‌ భీమసింగ్‌ రాథోడ్‌, టి.కుమారస్వామి అలియాస్‌ కుమార్‌, షేక్‌ షఫీక్‌ అహ్మద్‌ అలియాస్‌ షఫీ, నందిమంగళం యెజాజ్‌ పాషా అలియాస్‌ యెజాజ్‌, వీఎం .ఫుర్ఖాన్‌, షేక్‌ ఆసిఫ్‌, షేక్‌ సుహెల్‌లు ఉన్నారన్నారు. వీరితో సంబంధమున్న కర్ణాటకకు చెందిన రాథోడ్‌, కుమార్‌, బాబు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి 735 నకిలీ 500 రూపాయల నోట్లు, ఒక ఎప్సాన్‌ ఎకో ట్యాంక్‌ ఎల్‌3210 ప్రింటర్‌, టీఎన్‌పీఎల్‌ ఏ4 800 జీఎస్‌ఎం పేపర్ల మూడు పెట్టెలు, ఒక లెనివో ల్యాప్‌టాప్‌, 12 సెల్‌ఫోన్లు, ఆర్‌బీఐ అక్షరాలతో ముద్రించబడిన ఆకుపచ్చ రిబ్బన్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు, దొంగనోట్ల చలామణి గురించి ఒప్పుకున్నారని, వీరు ముగ్గురిపై ఇదివరకే కర్ణాటకలో పాత కేసులు ఉన్నాయన్నారు. ఈ ముగ్గురు మదనపల్లెలో దొంగ నోట్లను ముద్రించి చలామణి చేసేలా పథకం రచించారన్నారు. ఈ ముఠా నకిలీ నోట్లను ఎలా తయారు చేస్తోంది, వాటిని ఎలా పంపిణీ చేస్తోంది అనే వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌న్‌, వాయల్పాడు సీఐ జె.ప్రసాద్‌ బాబు, ఎస్‌ఐలను అభినందించారు. సిబ్బందికి జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు నగదు రివార్డులు ఇచ్చి ప్రోత్సహించారు.

10 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

నిందితులు కర్ణాటకతోపాటు అన్నమయ్య జిల్లా వారిగా గుర్తింపు

మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement