
అక్రమ కేసులు బనాయించడం దారుణం
రాయచోటి టౌన్ : మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె సమీపంలోని కొండపై బుద్ధుడి తలను నరికేసిన సంఘటనపై నిరసన తెలుపుతున్న బుద్ద అంబేద్కర్ సమాజ్ ఉపాసకులపై కేసులు పెట్టడం దారుణమని ఆ సంస్థ సభ్యులు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఆయనను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుద్ధ విగ్రహం ధ్వంసం చేయడాన్ని ప్రశ్నించినందుకు పోలీసులు తమపైనే కేసులు పెట్టడం విచారకరమన్నారు. జిల్లా పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల మోహన్, సీపీఐ నాయకులు శ్రీనివాసులు, బీఎస్పీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు యుగంధర్, రమణ పాల్గొన్నారు.