
14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సిద్దవటం : సిద్దవటం రేంజి సిద్దవటం బీటులోని కమ్మపాలెం గ్రామ సమీపంలో ఆదివారం అర్థరాత్రి ఎర్రచందనం అక్రమ రవాణాకు సిద్ధం చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసి 14 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు సిద్దవటం రేంజర్ కళావతి తెలిపారు. మరో స్మగ్లర్ పరారయ్యాడన్నారు. సోమవారం సాయంత్రం అటవీశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు సిద్దవటం మండలం కమ్మపాలెం గ్రామ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వెనుక వైపు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసేందుకు కారులో దుంగలను లోడ్ చేస్తుండగా తన సిబ్బందితో వెళ్లి దాడి నిర్వహించామన్నారు. కడప నగరం రామాంజనేయపురానికి చెందిన సన్నపూరి వెంకటరమణ, సీకే దిన్నె మండలం కొప్పర్తి గ్రామానికి చెందిన కొక్కిరపల్లె సుబ్బారెడ్డి, సిద్దవటం మండలం కమ్మపాలెం గ్రామానికి చెందిన కొడవటి కంటి శిఖామణిలను అరెస్టు చేశామన్నారు. తిరుపతికి చెందిన గిరిబాబు అనే వ్యక్తి పరారయ్యాడన్నారు. అతని కోసం తమ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారన్నారు. అక్కడ ఉన్న 14 ఎర్రచందనం దుంగలను, ఏపీ 04 ఏఏ 2007 నంబరు గల హుండై వర్ణా కారును స్వాధీనం చేసుకొని అటవీ శాఖ కార్యాలయానికి తరలించామన్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల బరువు 193 కిలోలు ఉండగా వాటి విలువ రూ. 56 వేలు చేస్తుందన్నారు. అరెస్టు చేసిన ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్‌లను తిరుపతి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ కె. ఓబులేసు, బీటు అధికారులు పెంచల్‌రెడ్డి, మధు, అసిస్టెంటు బీటు అధికారిణి హైమావతి, స్ట్రైకింగ్‌్ ఫోర్స్ సిబ్బంది, సాహెబ్ బావి బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు
మరొకరు పరార్