
అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు
వీరబల్లి : మండలంలోని మాండవ్య నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని మండల తహసీల్దారు ఖాజాబీ తెలిపారు. రాగిమానితొగడపల్లి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. తహసీల్దారు స్పందించి వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను పంపి విచారించారు. అక్రమంగా తరలిస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని వారు హెచ్చరించారు.
కోనంపేటలో చోరీ
లక్కిరెడ్డిపల్లె : మండలంలోని కోనంపేట టౌన్‌కు చెందిన కొర్లకుంట రామచంద్రయ్య ఇంట్లో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.లక్ష నగదు, బంగారు అపహరించుకు పోయినట్లు బాధితులు తెలియజేశారు. పొలం వద్ద మోటారు రిపేరు ఉండడంతో ఇంటికి తాళం వేసి వెళ్లామని, దొంగలు చొరబడి తాళం పగులగొట్టి నగదు, బంగారు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మండలానికి ఒక కిసాన్ డ్రోన్
సిద్దవటం : ప్రతి మండలానికి 80 శాతం రాయితీపై ఒక కిసాన్ డ్రోన్ ఇస్తామని రైతు బృందాలు అధికారులను సంప్రదించాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు చంద్రనాయక్ తెలిపారు. సిద్దవటం మండలం శాఖరాజుపల్లెలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మల్‌చింగ్ షీట్ పద్ధతిలో సాగు చేసిన దోస పంట పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులు ఈకేవైసీ ఫింగ్ ద్వారా చేయించుకోవాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సిద్దవటం వ్యవసాయ కార్యాలయంలో ఎరువుల పంపిణీని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏవో రమేష్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శివకుమార్, మురళి, రైతులు పాల్గొన్నారు.
నేడు పెన్షన్ అదాలత్
కడప సెవెన్‌రోడ్స్ : వెబెక్స్ వేదికగా గురువారం ఉదయం 11.30 గంటలకు పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కడప రీజినల్ కార్యాలయ సీపీఎఫ్ కమిషనర్ అభిషేక్ ఓ ప్రకటనలో తెలిపారు. రాబోయే మూడు నెలల్లో పెన్షనర్లు కాబోయే ఈపీఎస్ 1995 సభ్యులు కూడా అదాలత్‌తో తమ ఫిర్యాదులకు సమాధానాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. నిబంధనలు అర్థం చేసుకోవడానికి, ఫిర్యాదులను పరిష్కరించుకోవడానికి, ఈపీఎఫ్‌ఓ అధికారులతో సన్నిహితంగా ఉండడానికి ఇది ప్రత్యేక వేదిక అని తెలిపారు.
సెల్‌ఫోన్ దుకాణంలో చోరీ
కలసపాడు : మండల కేంద్రమైన కలసపాడు–గిద్దలూరు రహదారిపై ఎస్‌ఎన్‌ఎస్ సెల్‌ఫోన్ దుకాణంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు దుకాణం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారని దుకాణం యజమాని నాగూర్‌వలి తెలిపారు. రూ.50 వేల విలువైన ఐదు సెల్ ఫోన్లు, రూ.5 వేల విలువ చేసే బ్లూటూత్, సీసీ కెమెరా, రూ.15 వేల నగదు చోరీ చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
ప్రమాదంలో నలుగురికి గాయాలు
ముద్దనూరు : మండలంలోని కొత్తపల్లె సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. రాజంపేట నుంచి కొమ్మేమ్మరి గ్రామానికి వాహనంలో ప్రయాణిస్తుండగా ముందువైపు వెళ్తున్న వాహనం బ్రేక్ వేయడంతో దానిని ఢీకొని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రజాక్, గోవిందమ్మ, మద్దిలేటమ్మ, శివమ్మ గాయపడగా 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు.