
ఇరుకు వీధుల్లో.. స్వామి విహారమా!
రాజంపేట : ఏళ్ల నాటి సౌమ్యనాథుడి ఆలయం అభివృద్ధిలో వెనుకబడుతోంది. మాడ వీధులు ఇరుకుగా మారి.. స్వామి స్వేచ్ఛ విహారానికి దారి లేని పరిస్థితి. ఆలయ ముఖద్వారం ప్రమాదాలతో తరచూ దెబ్బతింటోంది. మాస్టర్‌ప్లాన్ అటకెక్కింది. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాల్లో నందలూరు సౌమ్యనాథాలయం ఒకటి. 11వ శతాబ్ధంలో చోళవంశరాజు కుళోత్తుంగచోళుడు ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ తొలి వైష్ణవ ఆలయం పదెకరాల విస్తీర్ణంలో 180 స్తంభాలు, వైఖానస, వైష్ణవగామ ఆర్షపోక్త వాస్తు యుక్తముగా నిర్మితమై ఉంది. ఇంత విశిష్టత కలిగిన ఈ ఆలయం అభివృద్ధిలో వెనుకబడి ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానంలో విలీనం చేశారు. దీంతో తాజాగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఒంటిమిట్ట రామయ్య తరహాలో ఇక్కడ ఉత్సవ శోభ సంతరించుకుంది.
స్వామికి.. దారేది
సౌమ్యనాధాలయంలో మాఢ వీధులు కుచించుకుపోతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథుడు మాఢ వీధుల్లో ఊరేగుతుంటారు. వాస్తు శాస్రోక్తంగా ఒంటిమిట్ట తరహాలోనే ఆలయం అత్యంత సమీపంలో మాఢ వీధులను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆలయానికి ఓ వైపు ప్రధాన రహదారి(నందలూరు–టంగుటూరు), మరోవైపు అత్యంత సమీప వీధి కుచించుకుపోయింది. ఉత్తర వైపు వీధి విశాలంగానే ఉంది. తూర్పు గాలిగోపురం వీధిని విస్తరించాల్సి ఉంది. ఇంత విశిష్టత కలిగిన ఈ ఆలయంలో మాఢ వీధుల అభివద్ధిపై టీటీడీ దృష్టి సారించాల్సి ఉంటుంది. నందలూరు బస్టాండు నుంచి(టంగుటూరు రోడ్డు) ఇరువైపులా ఆక్రమణలతో ముందుకొచ్చారు. భక్తుల రాక క్రమంగా పెరుగుతుండడంతో వాహనాల నిలిపేందుకు స్థలం లేని పరిస్థితి. ఆర్‌అండ్‌బీ స్ధలాల్లో నిర్మాణాలు చేపట్టి అధ్దె వసూలు చేస్తున్నారు. అయితే రోడ్డు విస్తరణ గాలికి వదిలేశారు.
సర్వే చేసిన కేంద్రపురావస్తు శాఖ
సౌమ్యనాథాలయం చుట్టూ వంద మీటర్ల స్ధలం కేంద్ర పురావస్తుశాఖ పరిధిలోకి వస్తుంది. గతంలో ఆ శాఖ వంద మీటర్ల వరకూ ఆలయం విస్తరించి ఉందని తేల్చడమేగాక, ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కొలతలు వేసి తర్వాత విషయం ఆటకెక్కించారు. ఒంటిమిట్ట తరహాలో ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆలయ స్థలాలు స్వాధీనం చేసుకుని వాహన మండపం, రథ మండపం, ఆఫీసు, అన్నదానసత్రం నిర్మాణానికి స్ధలం కేటాయించాల్సి ఉంది. మరోవైపు నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ పరిధిలోని కడప–రేణిగుంట జాతీయ రహదారిపై సౌమ్యనాథాలయ ఆర్చి 2004లో నిర్మించారు. నిత్యం వాహనాలు ఆర్చిని ఢీకొనడంతో ప్రమాదంగా మారింది. నూతనంగా ఆర్చినిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
టీటీడీలో విలీనమైనా..
మాడ వీధుల విస్తరణ లేదు
హైవేలో ప్రమాదాలతో దెబ్బతింటున్న ఆలయ ముఖద్వారం