
ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావాలి
మదనపల్లె రూరల్ : ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకువచ్చేందుకు జైలు సిబ్బంది కృషి చేయాలని జైళ్ల శాఖ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ అంజనీకుమార్ అన్నారు. మదనపల్లె సబ్ జైలు, డీఎస్పీ మహేంద్రతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. ఖైదీలతో ప్రత్యేకంగా మాట్లాడి జైలులో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. జైలు గదులు, మరుగుదొడ్లు పరిశీలించి, మూడు నెలలకు పైగా జైలులో ఉన్న ఖైదీల వివరాలు, బెయిల్ మంజూరైనా, బయటకు వెళ్లని ఖైదీల సమాచారం, ఉచిత న్యాయసేవలపై జైలర్ లక్ష్మణరావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నేరాలకు పాల్పడి జైలుకు వచ్చిన ఖైదీలలో మార్పు రావాలన్నారు. సత్ప్రవర్తన దిశగా వారు వెళ్లేలా జైలు అధికారులు చొరవ చూపాలన్నారు. ఆయన వెంట వన్‌టౌన్ సీఐ ఎరీషావలీ, తాలూకా ఎస్‌ఐ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.