
నిర్ణీత గడువులోగా ప్రజా సమస్యల పరిష్కారం
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యత ఇస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు. ఓబులవారిపల్లి మండలం, చిన్నఓరంపాడు నుంచి పి. వెంకటరమణ, బి.కొత్తపేట నుంచి పి.మల్లేశ్వరమ్మ, కలకడ నుంచి వై.వెంకటయ్య, ఏకిల వంకపల్లి రాయచోటి నుంచి నూర్జహాన్‌లు నడవలేని స్థితిలో ఎస్పీ కార్యాలయానికి తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ వారి వద్దకే వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు