
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
సుండుపల్లె : బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల రక్షణ అధికారి రామలక్ష్మీ అన్నారు. శనివారం మండలంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల, ఎంఎన్‌ఆర్ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో బాల్యవివాహాలు, లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహం చేయడం నేరమని అందుకు సహకరించిన వారికి లక్ష రూపాయలు జరిమానాతో పాటు రెండు సంవత్సరాలు జైలుశిక్ష పడుతుందని తెలిపారు. పాఠశాలలో గానీ ఇతర ప్రదేశాలలో గానీ పిల్లలను వేధించడం, పిల్లలకు తెలియకుండా ఇతర ప్రదేశాలకు తరలించడం వంటి పనులు ఎక్కడైనా జరిగితే 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్స్ సంస్థ కో ఆర్డినేటర్ రవీంద్రనాథ్, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.