
వినాయక విగ్రహం చోరీ కేసులో నిందితుల అరెస్టు
పెనగలూరు : పెనగలూరు మండలం ఓబిలి స్కూల్ ఆవరణంలో గత నెల 24వ తేదీ వినాయక విగ్రహాన్ని చోరీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బీవీ రమణ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. నందలూరు మండలం మదనగోపాలపురం గ్రామానికి చెందిన చుక్కా రవి ఆధ్వర్యంలో పది మంది పురుషులు, ముగ్గురు మహిళలు కలిసి వినాయక విగ్రహాన్ని చోరీ చేశారు. నిందితుల్లో రవితో పాటు పాత చిట్వేలికి చెందిన కనిశెట్టి వెంకట సుబ్బయ్య, సుబ్బరాయుడు, ఆర్.భాస్కర్, ఈటమాపురానికి చెందిన చంద్ర, బైరాజు, సుధాకర్ రాజులతోపాటు చుక్కారవి వియ్యంకుడు నెల్లూరు జిల్లా మనుబోలుకు చెందిన సురేష్, నెల్లూరులోని రాపూరు లక్ష్మమ్మ, మునిస్వామి, వేలు రెడ్డి, పూజారి గోకిల రమేష్, ముసునూరు పుల్లారెడ్డి, పెనగలూరుకు చెందిన దాసరి వెంకట నరసమ్మ, సుఖదేవ్ కలక్వాడ్ శ్యామ్‌లు ఉన్నారు. వినాయక విగ్రహాన్ని బయటకు తీసి ట్రాక్టర్‌కు కట్టుకొని ఓదేటావారిపల్లి గ్రామానికి వెళ్లే దారి వరకు ఈడ్చుకుంటూ వెళ్లి అక్కడ ట్రాక్టర్‌లో ఎక్కించుకొని నేరుగా ఈటమాపురం చెరువులోకి తీసుకెళ్లారన్నారు. చెరువులో విగ్రహాన్ని దింపి గుప్త నిధులకోసం పూజలు చేసి సమ్మెటతో రాతి వినాయక విగ్రహాన్ని పగులకొట్టి పడేశారన్నారు. పూర్వకాలంలో వజ్రాలు, బంగారం రాతి విగ్రహంలో పెట్టి ఉంటారనే నమ్మకంతో వీరు విగ్రహాన్ని చోరీ చేసి పగులకొట్టారని తెలిపారు. ఎలాంటి నగలు దొరకకపోవడంతో పగులకొట్టిన విగ్రహం ముక్కలను కుంటలో పడేశారన్నారు. కొండూరు క్రాస్ వద్ద శనివారం వీరు గుంపుగా ఉండటంతో విచారించగా గత నెలలో వినాయక విగ్రహం చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఇన్నోవా కారు, నాలుగు మోటార్ సైకిళ్లు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులకు రివార్డు కోసం ఎస్పీకి ప్రతిపాదించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ రవిప్రకాష్ రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు సుబ్బరాయుడు, రవిశంకర్, సిబ్బంది రాముడు, నాగయ్య, గోపాలకృష్ణ, సుజిత, నాగేశ్వరమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.