
బుద్ధ విగ్రహం తల తొలగింపు వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం
మదనపల్లె రూరల్ : తథాగతుడు గౌతమ బుద్ధుడి విగ్రహానికి తల తొలగించడాన్ని నిరసిస్తూ భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) చేపట్టిన దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరింది. కేసును తప్పుదోవ పట్టించి, నిందితుల్ని కాపాడేందుకు మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ ప్రయత్నిస్తున్నారంటూ పది మంది బౌద్ధులు అరగుండు, అర మీసంతో వినూత్నంగా శుక్రవారం నిరసన తెలియజేశారు. దళిత సేన కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో దళిత సేన సభ్యులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. బీడా శ్రీనివాస్ మాట్లాడుతూ బుద్ధుడి తల తొలగించిన మతోన్మాదులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామన్నారు. బాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీయం శివప్రసాద్ మాట్లాడుతూ బుద్ధ విహారను మానవ వికాస కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రెండు కోట్ల రూపాయలతోపనులు చేశామన్నారు. కొందరు ఉన్మాదులు పని గట్టుకొని ఒక్కొక్కటీ ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాలూకా సీఐ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ప్రత్యేక పోలీస్ బృందం ద్వారా కేసును ఇన్వెస్టిగేట్ చేయించాలని డిమాండ్ చేశారు. అనంతరం దీక్షా శిబిరం వద్దకు పోలీసులు చేరుకుని దీక్ష భగ్నం చేయడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ముత్యాల మోహన్, చాట్ల బయన్న, గంపల రమణ, వై.గంగాధర్, తలారి కష్ణ, నాగరాజు, నీరుగట్టి రమణ, కోనేటి దివాకర్, ఆవుల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.