
జల్సాలకు అలవాటుపడి.. దారి దోపిడీలకు పాల్పడి..
కడప అర్బన్ : జల్సాలకు అలవాటు పడి, అక్రమ ధనార్జన కోసం ఒంటరిగా ఉన్న మహిళల మెడలో బంగారు గొలుసులను లాక్కొని పోవడం, రోడ్డుపై వచ్చే వాహనాలను ఆపి వారిని కొట్టి డబ్బు, నగలు దోపిడీ చేయడం వంటి నేరాలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు బంగారు చైన్లు(5 తులాలు), ఒక బుల్లెట్ మోటారు సైకిల్, ఒక కత్తి, 4 సెల్ ఫోన్లు, రూ.10200 నగదు కలిపి మొత్తం రూ.6,50,000 విలువ గల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కడప సబ్ డివిజన్ పరిధిలో కమలాపురం మెయిన్ రోడ్ వేదాస్ స్కూల్ దగ్గర సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, కమలాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ షేక్ రోషన్ పర్యవేక్షణలో వల్లూరు ఎస్‌ఐ పెద్ద ఓబన్న, కమలాపురం ఎస్‌ఐ విద్యా సాగర్ తమ సిబ్బందితో కలిసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. చాపాడు మండలం, పల్లవోలు గ్రామానికి చెందిన చక్రకోళ్ల ప్రశాంత్ 13 కేసులలో నిందితుడిగా వున్నాడు. చాపాడు మండలం బద్రిపల్లెకు చెందిన పందిటి ఉదయ్ కుమార్ పండ్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతనిపై జిల్లాలో 10 కేసులున్నాయి. చాపాడు మండలం, పల్లవోలు గ్రామానికి చెందిన దుంపల వినోద్ కూలిపని చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతను జిల్లాలో 23 కేసులలో నిందితుడిగా వున్నాడు. వీరు ముగ్గురు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు పొందేందుకు దోపిడీలను మార్గంగా ఎంచుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లడం, ఒంటరిగా బైకుపై వెళ్లే వారిని బెదిరించి వారి వద్ద నుంచి నగలు, నగదు దోపిడీ చేయడం లాంటి నేరాలకు పాల్పడేవారు. నేరాలు చేసేందుకు వీరు వాడుతున్న బుల్లెట్ మోటార్ బైకును తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో డీ మార్ట్ వద్ద చోరీ చేసి తీసుకొచ్చారు. సోమవారం వారు ముగ్గురు నేరం చేసేందుకు మోటార్ బైకుపై వస్తుండగా కడప–కమలాపురం మార్గంలో పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుల నేరాల వివరాలు ఇలా..
● ఫిబ్రవరి 11న తేదీ వల్లూరు మండలం ఇ.కొత్తపల్లి గ్రామ సమీపంలో కాంతమ్మ అనే మహిళ మెడలో నుంచి 31.63 గ్రాముల పురి తిరిగిన బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు.
● మార్చి 3వ తేదీన తిరుపతి కరకంబాడి రోడ్ లో ఉన్న డీమార్ట్ సూపర్ మార్కెట్ వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్‌ను చోరీ చేశారు.
● ఏప్రిల్ 5వ తేదీన కడప–కమలాపురం మెయిన్ రోడ్ మదీనా కాలేజీ వద్ద కడప వైపు నుంచి టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై పాల డబ్బాలను పెట్టుకొని వస్తున్న వ్యక్తిని బలవంతంగా ఆపి బెదిరించి అతని వద్ద నుంచి ఐదు వేల రూపాయలు దోచుకున్నారు.
● కమలాపురం మండలం కోగటం గ్రామ సమీపంలో పొలాల వద్ద ఒక మహిళ మెడలో ఉన్న 4. 20 గ్రాముల సాదా బంగారు గొలుసును లాక్కెళ్లారు.
● వల్లూరు మండలం గోటూరు క్రాస్ దాటిన తరువాత ఓబాయపల్లి గ్రామ సమీపంలో ఆటోలోని వ్యక్తిని బయటికి లాగి అతని జేబులో ఉన్న 5200 రూపాయల నగదును బలవంతంగా లాక్కెళ్లారు.
ఈ కేసులలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు.
పోలీసుల సూచనలు..
తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని డీఎస్పీ కోరారు. పిల్లల మీద శ్రద్ధ చూపకపోతే వారి బంగారు భవిష్యత్తు పాడు కావడమే కాకుండా అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరన్నారు. మహిళలు బయటకు వచ్చే సందర్భంలో తాము ధరించిన ఆభరణాలు కనిపించ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విలువైన వస్తువులు బ్యాంకు లాకర్‌లో పెట్టుకోవాలన్నారు. అనుమానితులు గ్రామ పరిసరాల్లో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ముగ్గురు నిందితుల అరెస్టు
నగలు, నగదు, బుల్లెట్ వాహనం స్వాధీనం
నిందితులంతా
చాపాడు మండల వాసులు
విలేకరుల సమావేశంలో
కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడి

జల్సాలకు అలవాటుపడి.. దారి దోపిడీలకు పాల్పడి..