
గోపవరం ఎన్నికలో ప్రజాస్వామ్యం గెలిచింది
ప్రొద్దుటూరు : గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం గెలిచిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఉప సర్పంచ్ అభ్యర్థిగా బీరం రాఘవేంద్రారెడ్డి ఎన్నికైన అనంతరం సోమవారం తన స్వగృహంలో ఆయన విజయం సాధించిన అభ్యర్థులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ అనేక అవాంతరాల మధ్య, అభద్రత పరిస్థితుల నడుమ ఉప సర్పంచ్ ఎన్నిక ఎట్టకేలకు జరిగిందన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అత్యంత ప్రశాంతంగా, సజావుగా ఎన్నిక జరిపించి ప్రజా స్వామ్యాన్ని గెలిపించారన్నారు.
ఎన్నికలో విజయం సాధించడం కన్నా ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి చక్కగా విధులు నిర్వహించారన్నారు. ఎన్ని మార్లు ఓడినా, గెలిచినా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడమే ముఖ్యమన్నారు. గతంలో జరిగిన పొరపాటును వరదరాజులరెడ్డి సరిదిద్దుకున్నారన్నారు. వాస్తవానికి మార్చి 27న జరిగిన ఎన్నికల్లోనే తాము గెలవాల్సి ఉందని, టీడీపీ వైఖరి వల్ల ఎన్నిక వాయిదా పడిందన్నారు. 20 మంది వార్డు సభ్యుల్లో తమ వైపు 14 మంది ఉన్నా అడ్డదారిన గెలవాలని టీడీపీ చేసిన ప్రయత్నాలు నెరవేరలేదన్నారు.
వార్డు సభ్యులను స్ఫూర్తిగా తీసుకుంటాం
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చివరి వరకు తమ వెంట నడిచిన గోపవరం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లను తాము స్ఫూర్తిగా తీసుకుంటామని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. డబ్బులు ఇస్తామని, ప్రలోభాలకు గురిచేయడంతోపాటు బెదిరించి భయపెట్టారన్నారు. ఏమి చేసినా తమ వార్డు సభ్యులు ఎదరొడ్డి నిలబడి చివరకు తమకు విజయాన్ని అందించారన్నారు. ఇది మా జెండా గొప్పతనమని తెలిపారు. వైఎస్సార్‌సీపీలో ఉండి పదవులు అనుభవించిన తర్వాత పార్టీని వీడిన రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని, 2029 ఎన్నికల్లో తమ పార్టీ తప్పక గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే
రాచమల్లు శివప్రసాదరెడ్డి