
అప్పు తీర్చమంటే బెదిరిస్తున్నారు
రాయచోటి టౌన్ : తమ వద్ద అప్పు తీసుకున్నారు.. ఇప్పుడు అడిగితే బెదిరిస్తున్నారంటూ మదనపల్లె పట్టణానికి చెందిన కొందరు మహిళలు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె టౌన్ పరిధిలో సుజాత, సుంకర లావణ్య, పద్మప్రియ, గౌరి, నాగరత్న, నళిని, నాగమణి అనే మహిళలు తమవద్ద పలు దఫాలుగా రూ.3.5 కోట్లు అప్పుగా తీసుకున్నారని వారు తెలిపారు. తమ పిల్లలకు ఫీజులు కట్టాలని కొందరు ఇంటిలో అవసరం ఉందని మరి కొందరు ఇలా రకరకాల అవసరాల కోసం తమ దగ్గర అప్పు చేశారన్నారు. తమ డబ్బులు ఇవ్వాలని అడిగితే వారంతా ఒక గ్రూపుగా ఏర్పడి తమ ఇళ్ల వద్దకు వచ్చి దుర్భాషలాడటం, నానా యాగి చేయడం, గొడవకు దిగడం చేస్తున్నారని వాపోయారు. చేసేది లేక తాము కోర్టుకు వెళ్లామని చెప్పారు. తమపై కోర్టుకు వెళతారా అంటూ మరింత రెచ్చిపోయి గొడవకు వస్తున్నారని తెలిపారు. వీరిలో సుజాత అనే మహిళపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, తాము ఫిర్యాదు చేసిన తరువాత విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు కూడా సిద్ధం చేసుకొందన్నారు. ఆమె పాస్‌పోర్టు రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో సుగుణ, భారతి, కుసుమ, శ్రీదేవి, అనూరాధ, సునీత, సరస్వతి తదితరులు ఉన్నారు.
ఎస్పీకి బాధిత మహిళల ఫిర్యాదు