
బుక్ చేస్తున్నారు!
సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి కార్యాలయం దిశానిర్దేశం చేయగా.. కలెక్టరేట్ రంగంలోకి దిగింది. వైఎస్సార్ జిల్లా కడపలో ప్రభుత్వ, ప్రైవేటు లాడ్జిలు, కల్యాణమండపాలు, వసతి భవనాలు, కళాశాల హాస్టల్స్ ఇలా ఒక్కటి వదలడం లేదు. ఈ నెల 27,28,29 తేదీల్లో చేపట్టిన తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం ఎక్కడికక్కడ వసతికి అనువైన ఒక్క భవనం కూడా వదలకుండా బుక్ చేస్తోంది. అంతేనా.. ఆ 3 రోజులు ఇతరులెవ్వరికీ ఇవ్వకూడదంటూ యాజమానులకు ఆర్డర్ వేస్తోంది.
● కడప రింగురోడ్డులో ఉన్న పబ్బాపురం–చెర్లోపల్లె టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో మహానాడు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో భూమి చదును కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మహానాడు వేదిక ఏర్పాటుకు కావాల్సిన చర్యలు ఓ వైపు కొనసాగుతుండగా, మరోవైపు టీడీపీ నేతలకు వసతి సమకూర్చే చర్యలకు స్వయానా ప్రభుత్వ అధికారులు సిద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో అవకాశం ఉన్న ప్రతి వసతి గృహాన్ని పరిశీలించడం, ఆపై బుక్ చేయడంలో అటు రెవెన్యూ, ఇటు పోలీసులు నిమగ్నమయ్యారు.
ప్రైవేటు కళాశాలపై ప్రత్యేక దృష్టి....
కడప రింగు రోడ్డులో మహానాడు ఏర్పాటు చేస్తున్న నేపఽథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు కళాశాలలు, కార్పొరేట్ కళాశాలల హాస్టల్ భవనాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆయా కళాశాలల హాస్టల్ భవనాలను అదుపులో ఉంచుకంటే వందలాది మందికి ఒక్కో భవనంలో వసతి కల్పించవచ్చునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదివరకే జిల్లాలో ఇలాంటి చర్యలకు ఆయా ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. తాజాగా ప్రభుత్వ యంత్రాంగం రంగ ప్రవేశం చేసింది. సీఎంఓ ఆదేశాల మేరకు కలెక్టరేట్ వర్గాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు వసతి గృహాలు, లాడ్జీలు, కళాశాలలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఆ మూడు రోజులు తమకు అప్పగించాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు.
● కడపలో నిర్వహణపై డైలమా....
టీడీపీ మహానాడు కడపలో నిర్వహణపై ఇప్పటికీ సందిగ్ధం కొనసాగుతోంది. జిల్లాలో తెలుగుతమ్ముళ్ల మధ్య ఉన్న విభేదాలతో పలు పర్యాయాలు పర్యటించి స్థల ఎంపిక చేపట్టారు.అనువైన స్థలాన్ని ఎంపిక చేసినప్పటికీ గుంటూరు–కృష్ణా జిల్లాల్లోనే మహానాడు చేపట్టాలని అక్కడి నాయకులు పట్టుబడుతున్నట్లు సమాచారం.మరోవైపు ఇండియా–పాకిస్తాన్ ఉద్రిక్తతలు తీవ్రమయ్యే నేపథ్యంలో మహానాడు నిర్వహణకు అభ్యంతరం చెప్పే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితులల్లో ఈనెల 14న సీఎం చంద్రబాబు నేతృత్వంలో మహానాడు నిర్వహణపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మహానాడు 3రోజులు నిర్వహించాలా,ఒక్క రోజుతో ముగించాలా? ఒక్కరోజు అయితే కడపలో నిర్వహించడం అవసరమా? ఇలాంటి ప్రశ్నలన్నంటికీ చంద్రబాబు నిర్వహించే ఆ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పలువురు నేతలు చెబుతున్నారు.
సీఎంఓ డైరెక్షన్... కలెక్టరేట్ యాక్షన్!
టీడీపీ మహానాడు కోసం ముందస్తు బుకింగ్
లాడ్జిలు, వసతి భవనాలు స్వాధీనం చేసుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగం