
●కూటమి సర్కారులో విద్యార్థులకు సం‘క్షామం’
ఎన్నో ఆశలు...మరెన్నో ఆకాంక్షలు...ఇంకెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కార్ అమలు దిశగా అడుగులు వేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసిన దాఖలాలు లేవు. ప్రధానంగా ఇప్పటికీ తల్లికి వందనం అమలుకు సంబంధించి కనీసం విధి విదానాలు అమలు చేయకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. పాఠశాలల ఆధునీకరణకు నాడు–నేడు లాంటి స్కీములు గురించి కనీస ఆలోచన కూడా చేయకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. జగన్ సర్కార్ అమలు చేసిన పథకాలకే పేర్లు మార్చి వాటిని అరకొరగా అమలు చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో అందించకపోవడం దారుణం. విదేశీ విద్యకు ఇంకా శ్రీకారం చుట్టకపోవడం....విద్యా కానుక లాంటి పథకాలు సరిగా అమలు కాక నీరుగారి పోవడం పట్ల ప్రజల్లో చర్చకు దారి తీస్తోంది. ఏది ఏమైనా కూటమి సర్కార్ ట్యాబ్‌లు లాంటివి అందించకపోవడం చూస్తే ప్రభుత్వానికి పేద విద్యార్థుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది.