
ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు
సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరగనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 1 నుంచి 6 వరకు ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఉండదు. పోలింగ్ అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చెలరేగిన ఘర్షణల్లో అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘర్షణలకు బాధ్యులను చేస్తూ పలువురు పోలీసు అధికారులపై వేటు పడింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కూడా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అవసరమైతే రాజకీయ నేతల గృహ నిర్బంధాలు, జిల్లా బహిష్కరణ అమలుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు.. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం లేకపోలేదు.
144 సెక్షన్ అమలు
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు వీలుగా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కౌంటింగ్ కేంద్ర పరిసరాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం రాయచోటిలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను మూడంచెల భద్రత మధ్య భద్రపరిచారు. ప్రత్యేక బలగాలతో 24 గంటలపాటు నిఘా కొనసాగుతోంది. జూన్ 4వ తేదీ జరిగే కౌంటింగ్ శాంతియుతంగా సాగేందుకు కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్ల రేడియస్‌లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 నిబంధనల ప్రకారం శిక్షార్హులవుతారు.
Comments
Please login to add a commentAdd a comment