రాజకీయ ధురంధరుడు ఇకలేరు

YSRCP Senior Leader Satti Veereddy Passed Away - Sakshi

వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు సత్తి వీర్రెడ్డి మృతి

వీర్రెడ్డి భౌతిక కాయంపై పార్టీ జెండా కప్పి నివాళులర్పించిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ 

అనపర్తి: నిస్వార్థ సేవకుడు, రాజకీయ ధురంధరుడు, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు సత్తి వీర్రెడ్డి(81) ఇకలేరు. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన సత్తి వీర్రెడ్డి బుధవారం రాత్రి మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.

వీర్రెడ్డి రామవరం సొసైటీ అధ్యక్షుడిగా, పొలమూరు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడిగా, చెరకు అభివృద్ధి మండలి చైర్మన్‌గా, వైఎస్సార్‌ సీపీ సమన్వయ కమిటీ చైర్మన్‌గా సేవలందించారు. ఆయన భార్య రామవరం గ్రామ సర్పంచిగా, ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. పెద్దకుమారుడు వైజాగ్‌లో గౌతమి వ్యాపార సంస్థల అధినేతగా, చిన కుమారుడు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఈయన భౌతికకాయాన్ని గురువారం ఉదయం ఆయన స్వగ్రామమైన రామవరం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన  అభిమానులు తుది వీడ్కోలు పలికారు. అందరితో ఆప్యాయంగా ఉండే వీర్రెడ్డి ఇక లేరన్న విషయం ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

పలువురి సంతాపం.. 
వీర్రెడ్డి మృతికి ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి భాస్కరరెడ్డి, పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు, పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ తదితరులు వీర్రెడ్డి కుటుంబసభ్యులను ఫోన్‌లో పరామర్శించి సానుభూతి తెలిపారు. 

మంచి మిత్రుడిని కోల్పోయా... 
రాజకీయాల్లో నీతి, నిజాయితీగా మెలుగుతూ పార్టీకి, ప్రజలకు నిస్వార్థ సేవలు అందించిన మిత్రుడు వీర్రెడ్డిని కోల్పోవడం తనకు అత్యంత బాధాకరమని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ కన్నీటి పర్యంతమయ్యారు. వీర్రెడ్డి మరణ వార్త విని గురువారం ఉదయం రామవరం చేరుకున్నారు. ఆయన వీర్రెడ్డి భౌతికకాయంపై పూలమాల వేసి, వైఎస్సార్‌ సీపీ జెండాను కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజకీయ ధురంధరుడు, రాయవరం మునసుబు స్ఫూర్తితో ఆయన శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వీర్రెడ్డితో తనకు గల సాన్నిహిత్యాన్ని బోస్‌ గుర్తు చేసుకున్నారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వీర్రెడ్డి పార్టీ నియమాలకు కట్టుబడి పనిచేశారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. అనంతరం బోస్‌తోపాటు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top