అమరావతికి కాదు.. బిల్లుకు వ్యతిరేకం: వైవీ సుబ్బారెడ్డి | YSRCP MP YV Subba Reddy Key Comments on Amaravati Bill | Sakshi
Sakshi News home page

అమరావతికి కాదు.. బిల్లుకు వ్యతిరేకం: వైవీ సుబ్బారెడ్డి

Apr 3 2026 1:28 PM | Updated on Apr 3 2026 2:32 PM

YSRCP MP YV Subba Reddy Key Comments on Amaravati Bill

సాక్షి, ఢిల్లీ: అమరావతికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అమరావతి ప్రస్తుత బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. రాజ్యసభలో అమరావతిపై చర్చలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎంపీల గొంతు నొక్కారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోందన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా మా పార్టీకి తక్కువ సమయం కేటాయించారు. మా పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం ఎలా చేశారో రాజ్యసభ చైర్మన్‌కి వివరించాము. రాజ్యసభలో మాకు ఏడుగురు ఎంపీలు ఉన్నారు. మాకు 20 నిమిషాల సమయం ఇవ్వాలి. మాకు రాజ్యసభలో 5 నిమిషాలు సమయం ఇచ్చి మైక్ కట్ చేశారు. మాకన్నా చిన్న పార్టీలైన బీఆర్‌ఎస్‌, టీడీపీకి ఎక్కువ సమయం ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలకు ఒక్కొక్కరికి 10 నిమిషాలు సమయం ఇచ్చారు.  

మేము చెప్పిన అంశాలను ఉపరాష్ట్రపతి సానుకూలంగా విన్నారు. అడ్డుకోవడం వల్ల మిగిలిపోయిన మా ప్రసంగం రికార్డులలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు. బిల్లుకు మేము వ్యతిరేకం. రాజధాని రైతుల దగ్గర 50 వేల ఎకరాలు తీసుకున్నారు 29వేల మంది రైతులకు న్యాయం చేయమని అడిగాం. అమరావతి రైతులకు ఏవిధంగా న్యాయం చేస్తారో బిల్లులో పెట్టమని అడిగాం. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోంది. స్క్వేర్ ఫీట్‌కు 14 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా నిర్మాణానికి ఇంత ఖర్చు చేయలేదు. ఇదంతా ప్రజా ధనాన్ని లూటి చేయడమే. కోల్‌కత్తా, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఎన్ని ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు. మాకు కేటాయించిన సమయంపై రాజ్యసభ చైర్మన్‌కి వివరించాము. నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ గ్యాలరీలో టీడీపీ నేతలని టీవీలో చూపించారు. గ్యాలరీలో ఉన్న వారి ఫోటోలను పత్రికలలో వేశారు. దీనిపై విచారణ జరగాలి’ అని డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement