వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్ ధ్వజం
‘మావిగన్’ను ప్రజలంతా స్వాగతిస్తుండటంతో తట్టుకోలేకనే దిగజారుడు వ్యాఖ్యలతో డైవర్షన్ పాలిటిక్స్
మావిగన్ మోడల్‌లో పోర్టు, ఎయిర్‌పోర్టు, నేషనల్ హైవేలున్నాయి
అదే అమరావతిలో రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా నిర్మించాలి
సాక్షి, విశాఖపట్నం: ఏబీఎన్ రాధాకృష్ణ, ఆయన పత్రిక, టీవీ చానల్ రాష్ట్రానికి పట్టిన చీడలా తయారయ్యాయని వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన ‘మావిగన్’ అభివృద్ధి మోడల్‌పై ప్రజల్లో మంచి స్పందన రావడంతో తట్టుకోలేక తమ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను దూషిస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మావిగన్’తో తమ అవినీతి ఆశలు కూలిపోతాయనే భయంతో వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో కలసి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ వెంకటరామయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు.
అవినీతిపై ఎక్కుపెట్టిన గన్: కన్నబాబు
‘మావిగన్’ ప్రాంతాన్ని రాజధాని కారిడార్‌గా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా మారుతుందని వైఎస్ జగన్ ప్లాన్–బీ సూచించగానే అధికార పార్టీ ఉలిక్కిపడింది. వారం రోజులుగా పరిపాలనను పూర్తిగా పక్కన పెట్టి ట్రోల్ చేయడంలో నిమగ్నమైంది. ‘మావిగన్’ అనేది అమరావతిలో రూ.వేల కోట్ల అవినీతిపై ఎక్కుపెట్టిన గన్‌లా కనిపించింది. రూ.20 వేల కోట్లతో అభివృద్ధి చేయవచ్చని సూచిస్తుంటే కూటమి నాయకులు ఎందుకు భయపడుతున్నారు? అమరావతిని పూర్తి చేయడానికి తరాలు పడుతుందని మీరే చెబుతున్నప్పుడు త్వరితగతిన పూర్తయ్యే ‘మావిగన్’ ఆలోచన మంచిదే కదా!
ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు కడుపుమంటకి పరాకాష్ట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందంటూనే అమరావతిలో రోడ్లు, మౌలిక వసతులకు రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? రాజ్యసభలో రేణుకా చౌదరి వ్యాఖ్యలను కూటమి నాయకులు ఎందుకు ఖండించలేదు? అమరావతి గేటెడ్ కమ్యూనిటీలా మారిందని టీడీపీ నేతలే చెబుతున్నారు. టెండర్లు, డిజైన్లు, అడ్వాన్సుల పేరుతో రూ.వేల కోట్లు దోపిడీ జరుగుతోంది. ఈ కారణాల వల్లే సంబంధిత బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది.
అవినీతికే చట్టబద్ధత తెచ్చారు: గుడివాడ అమర్‌నాథ్
సీఎం చంద్రబాబు ‘మావిగన్’ పేరుకు వ్యతిరేకమా? లేక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకమా? సమాధానం చెప్పాలి. వైఎస్ జగన్ సూచించిన మావిగన్ మోడల్‌లో పోర్టు, ఎయిర్‌పోర్టు, నేషనల్ హైవేలు.. అన్నీ ఉన్నాయి. అమరావతిలో ఇవన్నీ రూ.వేల కోట్లు ఖర్చు చేసి కొత్తగా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు తెచి్చన చట్టబద్ధత రాజధానికి కాదు.. అమరావతి ముసుగులో చేస్తున్న అవినీతికి.


