
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని పార్లమెంట్‌లో ప్రస్తావిద్దాం
శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత బొత్స స్పష్టీకరణ
రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేత బొత్స
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉక్కు సంకల్పంతో ప్రజా ఉద్యమం నిర్మించాలని, అందుకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా నిలవాలని తమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. ఎంతోమంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇది ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదని అన్నారు.
రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దని ప్రధాని మోదీని గతంలోనే సభాముఖంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రానికి లేఖ కూడా రాశారని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబీవీకే)లో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు భేషజాలకు తావులేకుండా మీ వెంట నడుస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే శాసన మండలిలో ప్రస్తావించామని, అనేక వేదికలపై వైఎస్సార్‌సీపీ గళం వినిపించిందని తెలిపారు. పార్లమెంట్‌లోనూ లేవనెత్తేందుకు ఎంపీలు చొరవ తీసుకునేలా వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పార్లమెంట్‌లో ఏ పార్టీ ముందుకొచి్చనా మద్దతు ఇస్తామని చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టే ఉద్యమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను భాగస్వాములను చేసే కృషిలో బాధ్యత తీసుకుంటామని బొత్స సత్యనారాయణ తెలిపారు.
చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు: సీపీఎం, సీపీఐ
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపే బాధ్యత వైఎస్ జగన్‌దేనంటూ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నానా హడావుడి చేశారని, అధికారంలోకి వచ్చాక ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ తప్పుబట్టారు. ప్రతిపక్షంలో ఉంటేనే చంద్రబాబుకు ప్రజాస్వామ్య పరిరక్షణ గుర్తుకొస్తుందని, అధికారంలో ఉంటే ప్రైవేటీకరణ జపం చేస్తారని మండిపడ్డారు. టెంట్‌లు వేయనీయకుంటేనో, హౌస్ అరెస్టులు చేస్తేనో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ఆపలేరనే విషయాన్ని చంద్రబాబు గుర్తిస్తే మంచిదన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు చొరవ తీసుకోవాల్సిన టీడీపీ ఎంపీలు మిట్టల్ ఉక్కు పరిశ్రమకు గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరడం సిగ్గుచేటన్నారు. వాళ్లను తెలుగు ప్రజలు గెలిపించారా? మిట్టల్ గెలిపించారా? అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ లేదంటూనే ఉద్యోగులు, కార్మికుల తొలగింపు... పలు విభాగాల విక్రయం ఎందుకని ప్రశ్నించారు. ప్రైవేటీకరణలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని, అదే జరిగితే చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.
శంఖారావంతో ప్రజా చైతన్యం...
ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు విశాఖ ఉక్కు శంఖారావం పూరించి రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తేవాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. విద్యా సంస్థల్లో సమావేశాలు, బస్సు యాత్రల ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సభలు, కోటి సంతకాల సేకరణ, ఈ నెలాఖరులోగా విజయవాడలో భారీ ఆందోళన నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.
సమావేశంలో వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, మేధావుల ఫోరం కనీ్వనర్ చలసాని శ్రీనివాస్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు సీహెచ్ నరసింగరావు, మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, సీపీఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ తదితరులు మాట్లాడారు.