
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా
ధైర్యంగా నిలబడ్డారంటూ తిరువూరు కౌన్సిలర్లకు అభినందన
సాక్షి, అమరావతి/తిరువూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని.. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా కూటమి నేతలు బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్‌ను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కలిశారు.
చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకులు చేసిన దాడుల గురించి వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలను దీటుగా ఎదుర్కొందామని.. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనేక ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలబడ్డారంటూ కౌన్సిలర్లను అభినందించారు.
ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, తిరువూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాసు, కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు, మోదుగు ప్రసాద్, ఇనపనూరి చిన్నారి, పాలం రమాదేవి, గుమ్మా వెంకటేశ్వరి, పరసా సత్యనారాయణ, వెలుగోటి విజయలక్ష్మి, షేక్ నదియా, రామవరపు మంజుల, జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కలకొండ రవికుమార్, సీనియర్ నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నరెడ్ల వీరారెడ్డి, తిరువూరు మండలాధ్యక్షుడు తాళ్లూరి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు
