
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం, పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి పోలీసు అధికారులనే సస్పెండ్ చేయించారు అని అన్నారు. వందల మంది పోలీసులను వీఆర్‌కు పంపారు అని చెప్పుకొచ్చారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పీపుల్ ఫ్రెండ్లీ పోలీసులు.. గతంలో మా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తలెత్తుకుని పోలీసులు వివక్ష లేకుండా పని చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చంద్రబాబు మాట ఏ పోలీసు అధికారి అయినా వినాల్సిందే.. లేకుంటే ఇబ్బందులు తప్పవు. తప్పుడు కేసులు పెట్టి పోలీసు అధికారులనే సస్పెండ్ చేయించారు. వందల మంది పోలీసులను వీఆర్‌కు పంపారు డీజీ స్థాయి అధికారులను కూడా వేధిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్‌లు పీఎస్‌ఆర్, సంజయ్, కాంతిరాణా, విశాల్ గున్నీపై తప్పుడు కేసులు బనాయించారు. ఎనిమిది మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. అనేక మంది సిన్సియర్ అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారు.
తన మోచేతి నీళ్లు తాగే అధికారులను చంద్రబాబు తన కరప్షన్‌లో భాగం చేస్తున్నారు. ఇవేవీ భరించలేక సిద్ధార్థ కౌశల్ లాంటి యంగ్ అధికారుల రాజీనామా చేసిన పరిస్థితి చూశాం.. చంద్రబాబు ప్రభుత్వం అంతగా వేధిస్తోంది. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది’ అని ఘాటు విమర్శలు చేశారు.
