సాక్షి, తాడేపల్లి: ఏపీ డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో ఎన్నో అక్రమాలు జరిగాయని.. చంద్రబాబు సర్కార్ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. పేపర్ లీకుల్లో చంద్రబాబుదే రికార్డు అని చెప్పుకొచ్చారు. డీఎస్సీ పరీక్షల పేరుతో చంద్రబాబు, నారా లోకేష్ కలిసి అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలతో బయటపెట్టారు. తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని ఎద్దేవా చేశారు. ఇది జెన్‌జీ కాలం.. దేన్నీ చంద్రబాబు ఆపలేడనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.
డీఎస్సీ అవకతవకల అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక విషయాలను వెల్లడించారు. అలాగే, రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఒక్కరి తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
- డీఎస్సీ విషయంలో ఇవాళ వెలుగులోకి వస్తున్న విషయాలన్నీ చూస్తుంటే చాలా చాలా షాక్ కలిగిస్తున్నాయి.
- లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ము చేసింది.
- స్కాములు చేస్తూ, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసింది.
- ఇంత ఘోరంగా రిక్రూట్‌మెంట్ చేయడం అన్నది ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు.
- డీఎస్సీ అంటే లక్షల మంది యువత ఆశ. వారి భవిష్యత్తు.
- అలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియలో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డం అత్యంత దారుణం.
- అబద్ధానికి, మోసానికి, దగాకి, వెన్నుపోటుకు, స్కాముకు ఒక షర్టు ప్యాంటు తొడిగితే అది చంద్రబాబు.
- చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చూసినా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా తన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అయినా,
- ఇవాళ టీచర్ల రిక్రూట్‌మెంట్ చూసినా, ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
- 16వేల పోస్టులకే ఇన్ని స్కామ్‌లు, లీకులు కనిపిస్తున్నాయి.
మెగా డీఎస్సీ అనడానికి అర్హత లేదు..
- మా ప్రభుత్వంలో ఒకే సమయంలో ఒకే నోటిఫికేషన్ ఇచ్చాం.
- లక్షా 30వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశాం.
- దేశ చరిత్రలోనే లేని విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చాం.
- 2019 మే 30న సీఎంగా ప్రమాణం చేసిన 50 రోజుల్లోనే జీవో ఇచ్చాం.
- 19 లక్షల మంది పరీక్షలు రాస్తే ఒక్క తప్పు కూడా జరగలేదు.
- నాలుగు నెలల్లోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ భర్తీ పూర్తి చేశాం.
- ఇప్పుడు మాత్రం డీఎస్సీ పేరుతో అభ్యర్థులకు ఆవేదన మిగిల్చారు.
రికార్డు అంటే వైఎస్సార్‌సీపీదే..
- చంద్రబాబు అధికారంలోకి రాగానే ఐదు తొలి సంతకాలు అంటూ నానా హంగామా ఆర్భాటం చేశాడు.
- ఇదికూడా పెద్ద మోసమే.
- దీంట్లో మెగా డీఎస్సీ అనేది ఒక సంతకం.
- వాస్తవంగా మా ప్రభుత్వ హయాంలోనే 6,100 పోస్టులకు మేం నోటిఫికేషన్ ఇచ్చాం.
- వాటిని భర్తీచేయకుండా రద్దుచేసి, రిక్రూట్‌మెంట్ ఆలస్యం చేశారు.
- పైగా ఆ 6,100 పోస్టులతో కలిపి, ఇస్తున్న 16వేల పోస్టులకే మెగా పేరుపెట్టి చివరకు లీకులు, అక్రమాలు, స్కాములు, అవకతవకలు చేశారు.
- ఇదీ చంద్రబాబు మొదటి సంతకం పరిస్థితి.
- నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా?
- రికార్డు అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలోనే జరిగింది.
- గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం.
- ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు.
- మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, జులై 19న జీవో ఇచ్చాం.
- జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం.
- జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం.
- సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం.
- 2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు.
- ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.౩ లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం.
- ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు.
- అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేసాం.
- అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం.
- కానీ, మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు?
- మీరు చేసిన గోల్‌మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు?
- డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్‌లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత భద్రతతో జరగాలి.
- కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు.
- డీఎస్సీ పేపర్లను SCERT (State Council of Educational Research and Training) తయారు చేస్తుంది.
- పరీక్ష నిర్వహణను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు.
- కానీ, చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనపెట్టి, క్వశ్చన్ పేపర్ల తయారీ పరీక్షల నిర్వహణ, ఈ రెండు కీలక బాధ్యతలను కూడా SCERT డైరెక్టర్‌కు అప్పగించి పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీసింది.
- అక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే ఆజ్యం పోసింది. ఇక్కడ నుంచే మొదలైంది స్కెచ్.
చంద్రబాబు వ్యాఖ్యలు హాస్వాస్పదం..
- రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్నం తయారీ, అప్‌లోడ్‌ను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు.
- ఆ విషయం తెలిసి కూడా వారికే అప్పగించారు.
- తప్పు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై నెట్టాలనే ఈ పని చేశారు.
- పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న నవీన్ అనే వ్యక్తికి..
- ఆ పరీక్షలో టాప్ ర్యాంక్ రావడం పెద్ద స్కామ్ కాదా?.
- ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి సోషల్ స్టడీస్‌లో కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్, టీజీటీ జోన్-2లో ఆరో ర్యాంకు
- ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణల్లో ఉండటం, అదే వ్యక్తికి టాప్ ర్యాంక్ రావడం స్కామ్ కాదా?.
- ఇదంతా కనిపించింది మాత్రమే.. కనిపించని ఎన్ని లీక్‌లు ఉన్నాయో.
- మెరిట్‌తోనే ర్యాంక్ సాధిస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?.
- అతడి ఐడీ, డేటాను మాయం చేశారు.
- మెరిట్ లిస్టులో మార్పులు చేసి అతని పేరును మాయం చేశారు.
- తప్పు జరిగింది కాబట్టే అతని డేటాను మాయం చేశారు కదా?.
- మెరిట్ సాధిస్తే అతనికి కాల్ లెటర్ ఎందుకు పంపలేదు?.
- చివరికి ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
- చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.
- మొదటి ర్యాంక్ వ్యక్తి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాలేదట.
చంద్రబాబే పోలీసు.. లాయరు.. ఆదేశాలు...
- మెరిట్ లిస్టులో పేరు తీసేసి, ఆ కేండిడేట్ డేటాను మాయం చేసి, కాల్‌లెటర్ ఇవ్వనప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎలా వస్తాడు?
- మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? అందుకే కదా అతను కోర్టుకు పోయింది?
- ఒక కేండిడేట్‌కు ఫస్ట్ ర్యాంకు వస్తే, అందులోనూ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాడా?
- మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు.
- పేపర్ లీక్‌ను దాచిపెట్టడానికే ఈ కబుర్లన్నీ చెప్తున్నారంటూ అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు మీ నుంచి సమాధానం ఏమిటి?
- మీరు చెప్పేవి నిజాలు అయితే ఆ అభ్యర్థి కోర్టుకు ఎందుకు పోయాడు?
- పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు?
- డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది?
- ఎంతమందికి లీక్ వెళ్లింది?
- ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవి తేలాలి కదా?
- ఇలాంటి తప్పులు ఇంకెన్నో, అందుకే మేం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.
- ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఆయనే లాయరు, ఆయనే ఆదేశాలు ఇస్తారు, ఆయనే పర్యవేక్షిస్తారు.
- అధికారంలో ఉన్నది ఆయనే.. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది?
- పైగా విద్యాశాఖ మంత్రి ఆయన కొడుకే. మరి విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి?
- రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉందా?
పారదర్శకత ఎక్కడ?
- ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వెల్లడి అయినా అత్యంత పారదర్శకంగా ఉంటుంది.
- ఇప్పటికీ యూపీఎస్సీ-సివిల్స్ పరీక్ష ఫలితాలు చూస్తే చాలా పారదర్శకంగా మెరిట్‌లిస్టులు డిస్‌ప్లే చేస్తారు.
- కానీ, చంద్రబాబు డీఎస్సీ దీనికి పూర్తి విరుద్ధంగా సాగింది.
- మెరిట్ లిస్టులు లేవు. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు పబ్లిక్‌గా డిస్‌ప్లేలో పెట్టలేదు?
- సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపించే కొత్త పద్ధతి తీసుకువచ్చారు.
- మరి పారదర్శకత అనేది ఎక్కడ ఉంది. ఇందులో స్కామ్‌ల కంపు కనిపించడం లేదా?
- అసలు డీఎస్సీ అంటేనే “డిస్ట్రిక్ సెలెక్షన్ కమిటీ’’.. జిల్లాస్థాయిలో, కలెక్టర్ నేతృత్వంలో జరుగుతుంది.
- అలాంటి కలెక్టర్ కార్యాలయాల్లోనే పబ్లిక్ డిస్‌ప్లేలో మెరిట్ లిస్టులు పెట్టలేదు. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు లిస్టు పెట్టలేదు.
- మొత్తం ప్రక్రియను దాదాపుగా సెంట్రలైజ్ చేశారు. ఎందుకు ఇలా చేశారు? దీనికి కారణం, మీ ఉద్దేశాలు వేరే కాబట్టే కదా?
- ఉమ్మడి రాష్ట్రంలో కాని, ఈ రాష్ట్రంలో కాని అనేకమార్లు DSC పరీక్షలు జరిగాయి.
- జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులను డిస్‌ప్లే చేసేవారు.
- అక్కడ ఇచ్చిన కటాఫ్ మార్కులు, రోస్టర్ ఆధారంగా పరీక్షలు రాసినవారు, ఆ పోస్టు తనకు వస్తుందా? లేదా?
- అని దాదాపుగా ఒక అంచనాకు పారదర్శకంగా వచ్చే వాళ్లు.
- కానీ, ఇవాళ ఆ పరిస్థితి లేదు. అంతా దాపరికం, గందరగోళం.
- మెరిట్ లిస్టులు, రోస్టర్స్‌ను, మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు పబ్లిక్ డిస్‌ప్లేలో పెట్టలేదు. ఆన్‌లైన్ అంటూ సెంట్రలైజ్ చేశారు.
- ఆ ఆన్‌లైన్‌లో కూడా అనేక సార్లు, అనేక మార్పులు చేశారు..
- ఎవ్వరికీ ఏ సందేహం ఉన్నా, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే, వారు పట్టించుకోకుండా, పైన విద్యాభవన్‌కు వెళ్లాలని అని వారు చెప్తారు.
- తీరా ఇక్కడకు వస్తే, మీరు అక్కడికి పోండి, మాకు సంబంధం లేదని వీరు చెప్తారు.
ఎవరి కోసం సర్దుబాట్లు..
- చివరకు ఒక పోస్టుకు ఒకరు, అంటే 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు ఇచ్చి, వారిని పిలిచి,
- వారి సర్టిఫికెట్లు వెరిఫై చేసిమరీ వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. 1:1 అంటే అర్థం కాదా?
- ఒక పోస్టుకు, ఒక అభ్యర్థి అనే కదా అర్థం? ముందుగానే మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ ఇవన్నీ చూసిన తర్వాతే కదా కాల్‌లెటర్లు జారీచేశారు?
- సెలెక్షన్స్ రూల్స్‌లో రూల్ నంబర్ 20 ఇదే చెప్తోంది.
- ఎందుకంటే అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో మీకు తెలుసు, వారు ఓపెన్‌లోకి వస్తారా? లేక రిజర్వేషన్‌లోకి వస్తారా? అన్నది తెలుసు.
- వర్టికల్ రిజర్వేషన్ తెలుసు. హారిజాంటల్ రిజర్వేషన్ తెలుసు.
- ఎన్ని OC పోస్టులు ఉన్నాయో తెలుసు?
- ఎన్ని SC, ST, BC, EWS పోస్టులు ఉన్నాయి?
- ఉమెన్స్ కేటగిరీ కింద ఎన్ని పోస్టులు?
- స్పోర్ట్స్, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా కింద ఎన్నిపోస్టులు? ఇవన్నీ ముందుగానే చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు.
- ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా ఎవరు ఏ కోటా కిందకు వస్తారు?
- వారి ర్యాంకులు ఏంటి? అన్న విషయాలన్నీ ముందుగానే వారికి తెలుసు.
- ఇవన్నీ తెలిసిన తర్వాత, 1:1లో పిలిచిన తర్వాత, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా ఉద్యోగం రాకపోవడం ఏంటి?
- వెరిఫికేషన్‌లో సర్టిఫికెట్లు అన్నీ సరైనవి అని నిర్ధారించిన తర్వాత ఉద్యోగం రాకపోవడం ఏంటి?
- రిజెక్ట్ లిస్టులో కూడా పేరు లేకపోవడం ఏంటి?
- ఇది దగా కాదా? మోసం కాదా? దోపిడీ కాదా? స్కాం కాదా?
- ఇప్పుడేమో కాల్‌లెటర్ జారీచేస్తే ఉద్యోగం వచ్చినట్టు కాదని అంటున్నారు. మరి 1:1 పద్ధతికి అర్థమేంటి?
- మీరు పిలిచింది 1:5 లేదా 1:3 అయితే మీరు చెప్పిన వాదన కరెక్టు.
- సర్టిఫికెట్లలో ఏమైనా లోపాలు ఉంటే తప్ప 1:1లో కాల్‌లెటర్ వచ్చిన వాళ్లకు పోస్టు తప్పకుండా ఇవ్వాలా? వద్దా?
- 1:1లో పిలిచి ఉద్యోగం ఇవ్వకపోవడం అంటే దగా చేయడం కాదా?
- అన్ని సర్దుబాట్లు, అన్ని జీవోలు చూపిన తరువాతే మార్కులు, ర్యాంకులు, రిజర్వేషన్లు,
- అన్నీ చూసిన తర్వాతే 1:1లో పిలిచి, సర్టిఫికెట్లు అన్నీ బాగున్న తర్వాత కూడా ఉద్యోగం రాలేదు.
- మళ్లీ సర్దుబాటు జరిగింది అంటే, ఎవరికోసం జరిగింది ఈ సర్దుబాటు? ఎవరికోసం వీరికి అన్యాయం చేశారు?
స్పోర్ట్స్ కోటా పెద్ద స్కామ్..
- స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద స్కాం. ప్రతిభ ఉన్నవారికే కాదు, నిజంగా కష్టపడ్డ స్పోర్ట్స్ పర్సన్‌కు కూడా అన్యాయం జరిగింది.
- జీవో నంబర్-4, జీవో నంబర్-47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన “స్కామ్‌ల పాలసీ స్కెచ్’’ ఇది.
- గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదని..
- ఒక బ్యాక్‌డోర్ పెట్టి, ఆ బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు.
- దీని కోసం కొత్త జీవోలు తెచ్చారు. పని అయిపోయాక, మీరు అనుకున్న వారితో నింపాక, మళ్లీ పాలసీ మార్చారు, తెచ్చిన జీవోలను తీసేశారు.
- గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్‌మెంట్‌లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉంది.
- కాని, ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్‌లో మిగతా అభ్యర్థులతోపాటు వీరుకూడా ఎగ్జామ్స్ రాసి కచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే. అది రూల్.
- అలాంటి రూల్‌ను చంద్రబాబు మొత్తం మార్చేశాడు. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కి పెంచాడు.
- అసలు పరీక్షే రాయల్సిన అవసరం లేదంటూ జీవోలు ఇచ్చాడు.
- రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా, హిందీ, మ్యాథ్స్, సోషల్, సైన్స్, ఇంగ్లిష్, ఇంకా ఇలాంటి సబ్జెక్ట్‌లకు..
- డీఎస్సీ పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేలా, స్కామ్‌లు చేస్తూ తన వాళ్ల కోసం చంద్రబాబు ఒక తప్పుడు దారి వేశాడు.
- దీనికి ముందుగానే, వారి వద్ద నుంచి వసూళ్లు చేసి, వారికి అడ్డగోలుగా గేట్లు ఎత్తడానికి ఈ జీవోలు జారీచేశారు.
- అందులో కొన్ని పోస్టులకైతే ఉద్యోగం వచ్చిన తర్వాత, డీఎస్సీ పరీక్ష ఎలాగూ లేదు, నింపాదిగా డిగ్రీ కూడా సాధించడానికి ఐదేళ్ల సమయం కూడా ఇచ్చారు.
- స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా మార్చింది.
- క్రీడా ప్రతిభను కూడ చూడలేదు. పతకాలు చూడలేదు. బ్యాక్‌అప్ సర్టిఫికెట్లు కూడా లేవు.
- కేవలం ఆ ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు, ఉద్యోగాలు ఇచ్చేశారు.
- ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజ్, యూనివర్శిటీల తరఫున పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఈ ఉద్యోగాలు ఇచ్చేశారు.
- ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే, ఆ పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వీరే ఇచ్చారు.
సమాధానం చెప్పాల్సిందే..
- బాల్‌బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి.
- ఇందులో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆముదాలవలస టీడీపీ ఎమ్మోల్యే కూన రవికుమార్ కాగా, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ, లోకేష్ తోడల్లుడు ఎంపీ భరత్.
- వీళ్లే పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్లే వాటిని ధృవీకరిస్తారు.
- ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య పోలవరంలోని మారుమూల ప్రాంతంకు చెందిన వ్యక్తి.
- ఆయనకు 1:1 కాల్ లెటర్ అందుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాలేదు.
- కచ్చితంగా నిజమైన క్రీడాకారులకు జరిగిన అవమానం ఇది.
- క్రీడాకారుల పేరుతో చేసిన స్కాం కాదా ఇది?
- ముందు తన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేలా, జీవో నంబర్ 4, జీవో నంబర్ 47తో గేటు తెరిచారు.
- వాళ్లు లోపలికి వెళ్లాక, జీవో నంబర్ 25, జీవోనంబర్ 56లతో గేటు మూసేశారు.
- తమ పని అయిపోయిన తర్వాత మళ్లీ ఆ జీవోను ఎత్తేశారు.
- మీరు ఇచ్చిన జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 ఈరెండూ సరైనవే అయితే ఎందుకు మళ్లీ వాటిని తొలగించారు?
- దీనికి చంద్రబాబు సమాధానం చెప్పగలడా?
అలాంటి వారికి ఉద్యోగాలా?...
- ఎంపికైన అభ్యర్ధుల డేటాను చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.
- ఇంటర్ కాలేజ్, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్శిటీల తరఫున పార్టిసిపేట్ చేసినందుకే 270 మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి.
- వీళ్లకు పతకాలు రాలేదు, చెప్పకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు.
- జస్ట్ పాల్గొన్నారు అంతే.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.
- ఇలా సర్టిఫికెట్ల ఇచ్చిన జాబితా చూస్తే ఆంధ్ర యూనివర్శిటీ నుంచి 37, శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ నుంచి 31,
- నాగార్జున యూనివర్శిటీ నుంచి 28, ఆది కవి నన్నయ యూనివర్శిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్శిటీ నుంచి 15,
- శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ నుంచి 14, యోగి వేమన 7, డాక్టర్ అంబేద్కర్ యూనివర్శిటీ 4,
- సంస్కృత యూనివర్శిటీ నుంచి 2, మిగతా యూనివర్శిటీల నుంచి ఒక్కో సర్టిఫికెట్ ఉన్నాయి.
- ఇంటర్ కాలేజ్ పోటీల్లో, అంటే వివిధ కాలేజీల మధ్య జరిగే పోటీలలో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి.
- మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పాల్గొన్నందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.
- ఇక ఇంటర్ డిస్ట్రిక్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.
- జిల్లా తరఫున ఆడితే చాలు. గెలుపుతో సంబంధం లేకుండా, డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు.
- ఈ స్పోర్ట్స్ కోటా కింద టీచర్ ఉద్యోగాలను ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకుంటున్నట్టుగా,
- బేరసారాలు జరుగుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది.
- ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను డీపీగా పెట్టుకుని, ఒక కేండిడేట్‌తో బేరాసారాలు చేస్తున్న వీడియో ఇది.
- ఈ వీడియో బయటకు రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు.
- కేసు పెట్టినా విచారణ శూన్యం. ఈ విషయాలేవీ కూడా బయటకు రాకుండా దాచిపెట్టారు.
- ఎఫ్‌ఐఆర్ కాపీని ఒక్కసారి చూస్తే, వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది.
- పోలీసులు తలచుకుంటే ఈ నంబర్ ఎవరిదో కేవలం కొన్ని నిమిషాల్లో కనిపెడతారు.
- కానీ ఎఫ్‌ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో, వారి పేరు తెలపకుండా అనుమానిత వ్యక్తి, సస్పెక్ట్ అని రాశారు.
- పైగా ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలమ్‌లో ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయ్యిందని పెట్టారు.
- దీని అర్థం. ఈ వీడియో కాల్ ఆషామాషీది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తని తేలుతోంది.
- ఈ స్పోర్ట్స్ కోటా వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
- పైగా బలమైన సెక్షన్లు పెట్టి, గట్టిగా విచారణ చేయకపోగా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయడం వెనుక అసలు ఏ జరిగిందనేది తేల్చాలా? వద్దా?
లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇది...
- అసలు చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయమే ఉంటుంది.
- 1995లో టెన్త్ క్లాస్ పేపర్ల లీక్.
- 1996లో ఎంసెట్ ఇంజినీరింగ్ పేపర్స్ లీక్.
- 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్.
- 2017 టెన్త్ సైన్స్ పేపర్ లీక్.
- 2019లో టెన్త్ పేపర్ లీక్.
- 2025లో బీఈడీ పేపర్ లీక్,
- 2025లో టెన్త్ మ్యాథ్య్స్ పేపర్ లీక్.
- ఇప్పుడు DSC టీచర్ల రిక్రూట్‌మెంట్ లీక్. లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇది.
- ఈ తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోంది.
- అందుకే ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైనా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
- చంద్రబాబు ఒకటి గుర్తుపెట్టుకోవాలి.
- ఇది Gen-Z కాలం. Gen-Alpha కాలం. దేన్నీ నువ్వు ఆపలేవు చంద్రబాబూ.
- నువ్వు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై పెరుగుతుంది.
- దగాపడ్డ యువత నిన్ను విడిచిపెట్టదు, నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. కాక్రోచస్ లేస్తాయి.
- ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం.
- లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి.
- విద్యాశాఖ మంత్రిగా సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు సరికదా, ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
- అందుకనే వారం రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నావద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను.
- వారి తరఫున న్యాయపోరాటం చేస్తానని చెప్పాను.
- ఒకవేళ అప్పటికీ కాకపోతే, మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం.
- తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని చెప్పా.
రేపు వైఎస్సార్‌సీపీ ర్యాలీలు..
- రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం.
- దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి.
- చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతాం.
- దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతాం.


