దశరథన్నా.. ధైర్యంగా ఉండండి | YS Jagan Phone Call to Dasharatharami Reddy | Sakshi
Sakshi News home page

దశరథన్నా.. ధైర్యంగా ఉండండి

May 23 2026 5:17 AM | Updated on May 23 2026 5:17 AM

YS Jagan Phone Call to Dasharatharami Reddy

టీడీపీ మూకల దాడిలో గాయపడ్డ దశరథరామిరెడ్డికి ఫోన్‌లో వైఎస్‌ జగన్‌ పరామర్శ

తిరుపతి తుడా :  టీడీపీ రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాయచోటి మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ దశరథరామిరెడ్డిని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన వైఎస్‌ జగన్‌కు ఫోన్‌చేసి దశరథరామిరెడ్డితో మాట్లాడించారు. ఈ సందర్భంగా ఆయనకు జగన్‌ ధైర్యం చెప్పారు. ‘‘దశరథన్నా.. ధైర్యంగా ఉండండి. పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది’’ అంటూ భరోసా ఇచ్చారు. 

త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం గడికోట మీడియాతో మాట్లాడుతూ.. దశరథరామిరెడ్డిపై అతి కిరాతకంగా కత్తులు, రాడ్లతో దాడిచేయించారని మండిపడ్డారు. దీని వెనుక స్థానిక మంత్రి ప్రమేయం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ మూకలు అరాచక శక్తులుగా మారిపోయారన్నారు. ఇలాంటి దాడులు, బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ బెదరదని హెచ్చరించారు. ప్రశాంతమైన రాయచోటి కోసం తాము ప్రయతి్నస్తుంటే, టీడీపీ నేతలు అల్లర్లకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేస్తామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని గడికోట తేల్చిచెప్పారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దశరథరామిరెడ్డికి ఫోన్‌లో ధైర్యం చెబుతున్న వైఎస్‌ జగన్‌

Advertisement
 
Advertisement
Advertisement