అప్పుడు సంపద సృష్టిస్తానని చెప్పి.. ఇప్పుడు సంతానమే సంపద అంటున్నాడు
రాష్ట్రంలో రెండేళ్లుగా కన్పిస్తున్నదొక్కటే.. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ
సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు
రెండేళ్లయింది.. తగ్గకపోగా పెట్రోల్, డీజిల్ లీటర్‌కు రూ.4 పెరిగింది
2015లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్ విధించింది చంద్రబాబే
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ధరలు తగ్గించాల్సిందే
ప్రజలకు మేలు చేయాల్సిందిపోయి తన కాంట్రాక్టర్ల కోసం స్కామ్ చేశాడు.. రిటైల్ బంకుల్లో తక్కువ ధరకు ఇవ్వాలంటూ ఆయిల్ కంపెనీలకు లేఖలు రాశాడు
కేంద్రం లేఖ రాయడంతో బండారం బట్టబయలు
సూపర్ సిక్స్, సూపర్ సెవన్ సహా 143 హామీల అమలు చేయకుండా మోసం
మహిళలను పిల్లలుపుట్టించే యంత్రాలుగా చూడటం అత్యంత దారుణం
ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు, గ్యాస్, కొత్త పింఛన్లు అన్నీ ఉత్తుత్తే
వ్యవసాయం సహా అన్ని రంగాల్లో తిరోగమనం
చంద్రబాబు 2015లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్ విధించారు. ఆ మేరకు 2015 ఫిబ్రవరి 5న జీవో ఇచ్చారు. వ్యాట్‌కు అదనంగా ప్రతి లీటర్‌పై రూ.4 వడ్డన. ఆ తర్వాత మా హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం ఒక్క రూపాయి రోడ్ సెస్ వేశాం. దీన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వీళ్లంతా కలిసి నానా యాగీ చేసి, తమిళనాడు బార్డర్లో ఫొటోలు, సెల్ఫీలు తీసి ఎంతో బాదుతున్నట్టు పోజు కొట్టి.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించేస్తాం అన్నారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేస్తామని చెప్పారు. రెండేళ్లయింది. తగ్గకపోగా పెట్రోలు, డీజిల్ లీటర్‌కు రూ.4 పెరిగింది.
గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు. ఉచిత పంటల బీమా పథకం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. మోంథా తుపాను ఇన్‌పుట్ సబ్సిడీ ఇంత వరకు లేదు. సున్నా వడ్డీ లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం. ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ధర్నా చేస్తున్నాపట్టించుకునే నాథుడు లేడు. విద్యా దీవెన, వసతి దీవెన రెండూ కలిపి రూ.5,828 కోట్లు బాకీ. మళ్లీ ఈ సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలు విద్యా దివెన సొమ్ము రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన మరో రూ.1100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు. పాత బకాయిలు కలిపితే రూ.9,728 కోట్లు ఇవ్వాలి. ఈ రోజు పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి.
మేము తెచ్చిన జీపీఎస్ లేదు. ఓపీఎస్ లేదు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలన్నాడు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే అసలు జీతాలు నెలలో ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలీదు. జీపీఎఫ్, ఏపీ జీఎల్‌ఐ, మెడికల్ రీయింబర్స్‌మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్.. వీటన్నింటి కిందా రూ.35 వేల కోట్లు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి నోరు తెరిచి అడిగితే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశాడని ఆరోపించి, దొంగ కేసులు పెట్టి ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు.
ఈ రోజు గ్రామీణ ఎకానమీ చిన్నాభిన్నమయ్యే పరిస్థితిలో ఉంది. పొదుపు సంఘాల మహిళలందరూ ఇబ్బందులు పడుతున్నారు. యువత, మహిళలు ఉద్యోగాలు దొరక్క సతమతమవుతున్నారు. అన్ని రంగాలు తిరోగమనంలో ఉంటే, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అధ్వాన్న పరిస్థితుల్లో ఉంటే.. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు హయాంలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో కనిపిస్తుంటే, దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అని చెబుతున్నాడు.
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లలో ఫలాన మంచి చేశానని ప్రజలకు చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. రెండేళ్ల పనితీరు (ప్రోగ్రెస్ రిపోర్టు) చూస్తే.. ఒకే ఒక్కటి కని్పస్తుంది. అదే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ. ఈ రెండేళ్ల చంద్రబాబు పరిపాలనను గమనిస్తే కనిపించే నిజమిది’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌తోపాటు 143 హామీలను అమలు చేయకుండా ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సంతానమే సంపద అంటున్నారని దెప్పిపొడిచారు. ముగ్గురిని కంటే రూ.30 వేలు.. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామంటూ చంద్రబాబు మహిళలను పిల్లలను కనే యంత్రాలుగా చూస్తున్నారని.. ఇలాంటి దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా ఉండరని మండిపడ్డారు. జగన్ ఇంకా ఏమన్నారంటే..
అంతా అస్తవ్యస్తం.. కష్టాల్లో ప్రజలు
ఓ వైపు మా ప్రభుత్వ హయాంలో ఉన్న స్కీములన్నీ రద్దయి పోయాయి. ప్రజల చేతిలో చిల్లిగవ్వలేదు. మరోపక్క ఈయన ఇస్తానన్నవన్నీ మోసాలుగా మిగిలాయి. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. అతలాకుతలం అవుతున్న గ్రామీణ వ్యవస్థ. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రద్దు. రుణాల పరపతి మా హయాంలో మేం స్టార్ట్ చేసినప్పుడు రూ.25 వేల కోట్లు ఉంటే దాన్ని రూ.49 వేల కోట్లకు రుణాలు పెంచుకుంటూ పోయాం. సున్నా వడ్డీ ఇస్తూ, చేయూతనిస్తూ, అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలుస్తూ, ఆసరా అనే ప్రోగ్రామ్‌ను అమలు చేస్తూ, రకరకాలుగా చేయూతనిస్తూ ముందుకెళ్లాం.
చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి ఎంత దారుణంగా పడిపోయిందంటే.. సున్నా వడ్డీ సైతం రాని పరిస్థితి నెలకొంది. ఆసరా, చేయూత కథ దేవుడెరుగు.. అన్ని పథకాలు రద్దయి పోయాయి. ఈయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు మోసాలుగా తేలాయి. అక్కచెల్లెమ్మల పరపతి మొన్న డిసెంబర్ నాటికి రూ.31 వేల కోట్లకు పడిపోయింది. గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా పథకం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. మోంథా తుపాను ఇన్‌పుట్ సబ్సిడీ ఇంత వరకు లేదు. ఈ పరిస్థితిలో ఈ పెద్దమనిషి చెంపలేసుకుని కనీసం ఇప్పుడైనా పెట్రోల్, డీజిల్ ధర కనీసం రూ.8 అయినా తగ్గించాలా? లేదా?
పెట్రోల్, డీజిల్ ధరలు బాదింది బాబే
‘అయ్యా చంద్రబాబూ.. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అన్నావు, సూపర్ సెవెన్ అన్నావు. మేనిఫెస్టోలో 143 హామీలిచ్చావు. వీటి సంగతేమిటయ్యా అని చంద్రబాబును గట్టిగా ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరఫున మేం కూడా చంద్రబాబును గట్టిగా నిలదీస్తూనే ఉన్నాం. పెట్రోలు, డీజిల్ రేట్లు.. ఇప్పుడు హాట్ టాపిక్. వీటి ధర తగ్గిస్తామని వీళ్లు ఇచ్చిన హామీ ఈ రోజు వెన్నుపోటు కాదా? 2014–19 మధ్య ఏ రేట్లు అయితే ఉన్నాయో, ఆ రేట్లే మా హయాంలో ఉన్నాయి. చంద్రబాబు హయాంలో ఎప్పుడెప్పుడు రేట్లు పెరిగాయో చూడండి. (పీపీటీలో పెట్రోల్, డీజిల్ రేట్లు చూపించారు) చంద్రబాబు 2015లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్ విధించారు. ఆ మేరకు 2015 ఫిబ్రవరి 5న జీవో ఇచ్చారు.
వ్యాట్‌కు అదనంగా ప్రతి లీటర్‌పై రూ.4 వడ్డన. ఆ తర్వాత మా హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం ఒక్క రూపాయి రోడ్ సెస్ వేశాం. దీన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వీళ్లంతా కలిసి నానా యాగీ చేసి, తమిళనాడు బార్డర్లో ఫొటోలు, సెల్ఫీలు తీసి ఎంతో బాదుతున్నట్టు పోజు కొట్టి.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించేస్తాం అన్నారు. (చంద్రబాబు, లోకేశ్ ప్రసంగాల వీడియో చూపారు) మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేస్తామని చెప్పారు. రెండేళ్లయింది. తగ్గకపోగా పెట్రోలు, డీజిల్ లీటర్‌కు రూ.4 పెరిగింది. నిజంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.
పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఏమైంది?
» ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తానని చెప్పి రెండేళ్లు అవుతోంది. ఇంత వరకు రూపాయి ఇవ్వలేదు. సంవత్సరానికి రూ.18 వేలు. రెండేళ్లకు రూ.36 వేలు ప్రతి మహిళకూ బాకీ. ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అన్నావు. రెండేళ్లయి పోయింది. ఏటా రూ.36 వేలు చొప్పున రూ.72 వేలు బాకీ. అప్పుడు ఇంటింటికీ పోయి బాండ్లు ఇచ్చారు. ఈ బాకీ ఎప్పుడు తీరుస్తారు?
50 ఏళ్లకే పెన్షన్ లేదు
» 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేలు పింఛన్ ఇస్తానన్నావు. అదీ జూన్ 2024 నుంచి. నెలకు రూ.4 వేలు అంటే సంవత్సరానికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇంత వరకు రూపాయి ఇచ్చింది లేదు. గ్రామాల్లో ప్రతి ఇంట్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు చంద్రబాబును.
రైతుల నడ్డి విరిచారు
రైతుల పరిస్థితి చూస్తే మరీ అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక, ఏడాదికి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్నారు. రెండేళ్లయి పోయింది. మొదటి ఏడాది ఎగ్గొట్టాడు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాలి. ఇచ్చింది కేవలం రూ.14 వేలు. రూ.26 వేలు ఎగ్గొట్టాడు. అంతే కాకుండా 50 లక్షల మంది రైతులకు మా హయాంలో రైతు భరోసా ఇస్తే, ఇప్పుడు అందులో 7 లక్షల మందికి కోత కోశాడు.
కేంద్ర ప్రభుత్వానికి రైతు భరోసా గురించి చెప్పింది మేము. నేను రైతు భరోసా చెప్పిన తర్వాత, నా పాదయాత్ర జరిగి చివరికి వచ్చిన తర్వాత చివర్లో మోదీ∙వాళ్లు ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఉచిత పంటల బీమా లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. సున్నా వడ్డీ లేదు. ఈ–క్రాప్, ఆర్బీకేలు నిర్వీర్యం. ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ధర్నా చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు.
ఉచిత బస్సు.. తుస్సు
రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఫ్రీ బస్సు అన్నాడు. 16 కేటగిరీల బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీల బస్సులకే పరిమితం చేస్తున్నాడు. ఆ 5 కేటగిరీలు పర్మిట్ చేసే దానికి కూడా ఇప్పుడు మళ్లీ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తారట. ఇందులో ఉచితం లేదంటూ మహిళలకు ద్రోహం చేయడానికి మళ్లీ పూనుకున్నారు. ఇది ఒక ఎఫెక్ట్ అయితే, రెండోది మేము ప్రభుత్వంలో విలీనం చేసిన 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగస్తుల బతుకులు ప్రశ్నార్థకం చేశారు. ఏకంగా 12 డిపోలను ప్రైవేటుపరం చేశాడు.. భూములతో సహా. భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు. ఆర్టీసీ బస్సు ఉండదు. ఆర్టీసీ ఉండదు.
అతీగతిలేని విద్యాదీవెన.. వసతిదీవెన
ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద ఈ రెండేళ్లలో ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు ఇవ్వాలి. 2024 జనవరి–ఏప్రిల్ త్రైమాసికానికి సంబంధించి వెరిఫికేషన్ పూర్తయింది. ఎన్నికల కోడ్ కారణంగా అప్పటి సొమ్ము పంపిణీ నిలిచిపోయింది. నాటి నుంచి నేటి వరకు 9 త్రైమాసికాలు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది. ఇప్పటికి 9 త్రైమాసికాలు అయిపోయాయి. ఈ మార్చి నాటికే బకాయిలు రూ.5,820 కోట్లు. విద్యా దీవెన కింద 9 త్రైమాసికాలకు క్వార్టర్‌కు రూ.700 కోట్లు చొప్పున రూ.6,300 కోట్లు.
ఇప్పటికి ఇచ్చింది ఎంత అంటే, ఒకసారి రూ.1,770 కోట్లు, ఇప్పుడు రూ.900 కోట్లు ఇచ్చాడు. అంటే రూ.2,670 కోట్లు. రూ.3,628 కోట్లు ఇప్పటికే విద్యాదీవెన కింద బకాయిలున్నాయి. వసతి దీవెన ప్రతి జనవరిలో రూ.1,100 కోట్లు క్రమం తప్పకుండా మా హయాంలో ఇచ్చే వాళ్లం. వసతి దీవెన కింద జనవరి 2025 రూ.1,100 కోట్లు, జనవరి 2026 మరో రూ.1,100 కోట్లు.. ఇప్పటికే రూ.2,200 కోట్లు బాకీ. రెండూ కలిపి రూ.5,828 కోట్లు బాకీ. మళ్లీ ఈ సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలు విద్యా దివెన సొమ్ము రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన మరో రూ.1100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు. పాత బకాయిలు కలిపితే రూ.9,728 కోట్లు ఇవ్వాలి. ఈ రోజు పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి. పట్టించుకునే నాథుడే లేడు.
అమ్మ ఒడి మరో మోసం
ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నారు. చివరికి చూస్తే 20 లక్షల మంది పిల్లల్ని తగ్గించేశారు. రూ.15 వేల కథ దేవుడెరుగు. కొందరికి రూ.9 వేలు. కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.10 వేలు. కొందరికి మాత్రమే రూ.13 వేలు. ఇదీ అమ్మ ఒడి పరిస్థితి.
గ్యాస్ కూడా లేదు
గ్యాస్ సిలెండర్ల పరిస్థితీ అంతే. ఇప్పటికి 9 ఉచిత సిలెండర్లు ఇవ్వాలి మూడో సంవత్సరం కలుపుకుంటే. ఇంత వరకు ఇచ్చింది ఒకటి రెండు. అది కూడా అందరికీ ఇవ్వలేదు. నంబర్ డ్రాస్టిక్‌గా తగ్గించారు. కోటీ 50 లక్షల నుంచి 90 లక్షలకు తగ్గించారు. ఇచ్చే అర కొరలో కూడా అన్యాయం.
కొత్త పెన్షన్లు లేవు.. ప్రతి నెలా 25 వేలు కట్
మా హయాంలో ఎన్నికల షెడ్యూలు వచ్చే నాటికి 66,34,372 పెన్షన్లు పంపిణీ చేశాం. ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయించాం. చంద్రబాబు హయాంలో పెన్షన్ రూ.1000, మా హయాంలో రూ.3 వేలకు పెంచుకుంటూ పోయాం. వాటిని చంద్రబాబు తగ్గించేస్తున్నారు. ఈ మే నెలలో 60,11,293 పెన్షన్లు మాత్రమే ఇచ్చారు. ఏకంగా 6,23,079 మంది పెన్షన్లు తగ్గించేశారు. ప్రతి నెలా 25 వేల పెన్షన్లు కట్ చేస్తున్నారు. కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వకపోగా 6,23,079 మంది పెన్షన్లు కట్ చేశారు.
సంక్షోభంలోనూ స్కామ్
పెట్రో ధరలు తగ్గించకపోగా ఈ మనిషి ఏం చేశాడో తెలుసా? ఇక్కడా స్కామే చేశాడు. సంక్షోభంలో స్కాములు ఎలా చేస్తారో చంద్రబాబు దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఓ పక్క ఏప్రిల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. పెట్రోలు బంకుల దగ్గర జనం బారులు తీరారు. ఆ పరిస్థితుల్లో కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉంచి మేలు చేయాలన్న ఆలోచన చేయాల్సింది పోయి ప్రజలను ఇక్కట్లపాలు చేశాడు. అమరావతిలో కాంట్రాక్టర్లకు రీటెయిల్ బంకుల్లో తక్కువ ధరకు డీజిల్, పెట్రోల్ ఇవ్వండంటూ బీపీసీఎల్, ఐవోసీ తదితర ఆయిల్ కంపెనీలకు లెటర్ (లేఖను చూపుతూ) రాశాడు.
మీ ఎన్డీయే కూటమిలో సభ్యుడు చంద్రబాబు ఇలా అడుగుతున్నాడు.. మేం ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదని ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వాళ్లు కేంద్ర మంత్రికి చెప్పారు. అక్కడి నుంచి మోదీ షంటుకున్నారు. దానిపై కేంద్రం చంద్రబాబుకు చీవాట్లు పెడుతూ తిరిగి లేఖ రాసింది. నీకు బుద్దీ జ్ఞానం ఉందా లేదా చంద్రబాబూ? దేశంలో పెట్రోలు, డీజిల్ దొరక్క ప్రజలందరూ అవస్థలు పడుతుంటే, బల్క్ డీజిల్ కొంటే రేటెక్కువ అని చెప్పి.. కాంట్రాక్టర్లకు రీటెయిల్ బంకుల్లో డీజిల్ పోయమని ఎలా అడుగుతున్నావు అని కేంద్రం లేఖ రాసింది.
ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? తద్వారా ఆ కాంట్రాక్టు పనుల్లో ఈయనకొచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రమే ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా.. ఈ ముఖ్యమంత్రి తప్ప! నీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచన చేసి, బల్క్ లో వాళ్లు డీజిల్ కొంటే లీటర్ రూ.155 అవుతుందని, రీటెయిల్ పెట్రోలు బంకుల్లో కొంటే రూ.101కే దొరుకుతుందని, వాళ్లకు రూ.101కే రీటెయిల్ బంకుల్లో పోయమని నువ్వు లేఖ ఎలా రాశావు? పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గిస్తామన్న హామీనే కాదు.. సూపర్ సిక్స్ అయినా అంతే, సూపర్ సెవెన్ అయినా అంతే. ఇదే పరిస్థితే. (పీపీటీలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు చూపించారు)
ఉద్యోగుల బకాయిలు రూ.35 వేల కోట్లు
చంద్రబాబు ఉద్యోగులను మరీ దారుణంగా మోసం చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్.. ప్రతి ఆరు నెలలకు డీఏ ఇవ్వాలి. మా హయాంలో ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. 11 డీఏలు ఇచ్చాం. ఒకటి ఎక్కువ ఇచ్చాం. అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాం. కాలయాపన లేకుండా పీఆర్సీ వేశాం. ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ప్రతి అడుగులో చేయి పట్టుకుని నడపిస్తూ.. వీళ్ల గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో.. వీళ్లు సీపీఎస్‌తో ఇబ్బంది పడుతుంటే.. జీపీఎస్ అనే విధానం కూడా తీసుకువచ్చాం.
ఈ రోజు మేము తీసుకువచ్చిన జీపీఎస్‌ను దేశం అంతా కాపీ కొడుతోంది. ఈ రోజు ఉద్యోగుల పరిస్థితి చూస్తే.. ఈ జూన్ వస్తే 5వ డీఏ కూడా పెండింగ్. అధికారంలోకి రాగానే ఐఆర్ అన్నారు. ఇంత వరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మెరుగైన పీఆర్సీ అన్నాడు. మా హయాంలో వేసిన పీఆర్సీ చైర్మన్‌ను కూడా తీసేశారు. కొత్త వారిని కావాలని వేయడం లేదు. ఎందుకంటే కొత్త వారిని వేస్తే రికమండేషన్స్ వస్తే వెంటనే జీతాలు పెంచాలి కాబట్టి. అందుకే పీఆర్సీ వేయడం లేదు. పోలీసు సోదరులకు సరెండర్ లీవ్స్ 5 పెండింగ్. మొట్టమొదటిసారిగా చంద్రబాబు సరెండర్ లీవ్‌ను స్ప్లిట్ చేస్తున్నాడు. వాయిదా పద్ధతి పెడుతున్నాడు.
మరోవైపు ఐదు సరెండర్ లీవ్స్ పెండింగ్. 15 నెలలు టీఏలు పెండింగ్. మేము తెచ్చిన జీపీఎస్ లేదు. ఓపీఎస్ లేదు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలన్నాడు... ఈ రోజు పరిస్థితి ఏంటంటే అసలు జీతాలు నెలలో ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలీదు. జీపీఎఫ్, ఏపీ జీఎల్‌ఐ, మెడికల్ రీయింబర్స్‌మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్.. వీటన్నింటి కిందా రూ.35 వేల కోట్లు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరైనా అడిగితే.. ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి నోరు తెరిచి అడిగితే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశాడని ఆరోపించి, దొంగ కేసులు పెట్టి ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు.
అప్పుడు సంపద సృష్టిస్తానని.. ఇప్పుడు పిల్లలే సంపద అంటావా?
» సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి చంద్రబాబు.. ఇప్పుడు సంతానమే సంపద అంటున్నాడు. ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అంటున్నాడు. ఇంకా మోటివేట్ చేస్తూ.. ముగ్గురిని కంటే రూ.30 వేలు ఇస్తానంటున్నాడు. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తా అంటున్నాడు. వీటి కథ దేవుడెరుగు.. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ హామీలు ఏమైనాయి స్వామీ? ముందు వీటి గురించి ఆలోచించు. ఆ తర్వాత మూడో సంతానం.. నాలుగో సంతానం గురించి చెబితే.. అంతో ఇంతో వినడానికి అవకాశం ఉంటుందని ప్రజలు మొత్తుకుంటున్నారు.
» ఈ పెద్దమనిషి చంద్రబాబు ఏదైతే చెబుతాడో.. దాన్ని ఆయన పాటించాలి కదా.. కనీసం ఆయన కొడుకైనా పాటించాలి కదా.. ఆయన కొడుక్కి ఒకడే. ఆయనకొకడే. కానీ బీదోళ్లకు మాత్రం నలుగురు సంతానం కావాలా! వారు చదువుకోకూడదు. వాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు. వాళ్లు ఇంగ్లిష్ మీడియం చదవకూడదు. వాళ్ల బతుకులు ఎప్పుడూ చితికిపోయి ఉండాలనే దిక్కుమాలిన ఆలోచనలు చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో చంద్రబాబు తప్ప మరెవరూ ఉండరు.
» ఈ రోజు గ్రామీణ ఎకానమీ చిన్నాభిన్నమయ్యే పరిస్థితిలో ఉంటే.. పొదుపు సంఘాల మహిళలందరూ ఇబ్బందులు పడుతుంటే.. యువత, మహిళలకు ఉద్యోగాలు దొరక్క సతమతమవుతుంటే.. అన్నీ తిరోగమనంలో ఉంటే, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అధ్వాన్న పరిస్థితుల్లో ఉంటే.. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు హయాంలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో కనిపిస్తుంటే, దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అని చెబుతున్నాడు.
» మహిళలను పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తున్న అతి దిగజారుడు రాజకీయం. నిజానికి మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. వారు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. చంద్రబాబు మహిళలను పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా చూడటం అంటే ఇంతకంటే దారుణమైనపరిస్థితులు రాష్ట్రంలో ఎన్నడూ లేవు.
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో దైన్యం
అసలు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? విద్య, వైద్యం, వ్యవసాయం అన్నీ పూర్తిగా మూలన పడిన పరిస్థితులు. ఈరోజు స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లిష్ మీడియం చదువులు ఆగిపోయిన పరిస్థితి. మా హయాంలో మూడో తరగతి నుంచి టోఫెల్ ఒక పిరియడ్‌గా పెడితే, దాన్ని తీసేసిన పరిస్థితి. మా హయాంలో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ దాకా ప్రయాణం అని చెప్పి మేము తీసుకువస్తే.. అసలు ఇంగ్లిష్ మీడియమే లేకుండా చేసిన పరిస్థితి. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మేము తీసుకువస్తే.. అది గాలికొదిలేసిన పరిస్థితి.
నాడు–నేడుతో మేము బడులను బాగు పరిస్తే.. ఇప్పుడు పూర్తిగా గాలికొదిలేసిన పరిస్థితి. ఆరో తరగతి నుంచి ప్రభుత్వ స్కూళ్లను డిజిటలైజ్ చేసి ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా మేము చేస్తే.. ఈ రోజు ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు సంకోచించే పరిస్థితి. ప్రభుత్వ బడుల్లో 8వ తరగతికొచ్చే సరికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఒక మేనమామలా మేము చదివిస్తే.. ఈ రోజు పిల్లలకు ట్యాబుల కథ దేవుడెరుగు, కనీసం గోరుముద్దలో కూడా క్వాలిటీ లేని పరిస్థితి ఈరోజు బడుల్లో నడుస్తోంది. ఈ రోజు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు. విద్యా దీవెన లేదు. వసతి దీవెన లేదు. చదువులు ఆపేస్తున్న పరిస్థితి.
స్కూళ్లు, అంగన్ వాడీలు, హాస్టళ్లలో పిల్లలకు సరైన పౌష్టిక ఆహారం అందక పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్న పరిస్థితి. ఆస్పత్రులు నాశనం చేశారు. విలేజ్ క్లినిక్‌ల దగ్గర నుంచి.. పీహెచ్‌సీల దగ్గర నుంచి.. హాస్పిటల్స్‌ను రిఫార్మ్ ద్వారా సంస్కరించి.. జీరో వేకెన్సీ పాలసీ తీసుకువచ్చి, సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొరతలేని పరిస్థితి మా హయాంలో తీసుకువచ్చాం. ఈ రోజు పూర్తిగా అన్నీ నాశనమైన పరిస్థితి. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడానికి మేము శ్రీకారం చుట్టి, వాటిలో ఐదు పూర్తి చేశాం. మిగిలినవి వివిధ రకాల స్టేజ్‌లలో ఉన్నాయి.
కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అది కూడా ఐదేళ్లలో ఖర్చు చేస్తే అవి కూడా పూర్తవుతాయి. పిల్లలందరికీ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి వస్తుంది. దానిని పక్కన పెట్టి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. అమరావతిలో బిల్డింగ్‌లకు గ్లాసుల కోసం.. కేవలం భవనం అద్దాలకు రూ.2,500 కోట్లు ఖర్చు చేయడానికి ముందుకు వస్తాడు కానీ, మెడికల్ కాలేజీలకు డబ్బులివ్వడానికి మనసు రాదు. నాడు–నేడు కింద స్కూళ్లను బాగు చేయడానికి మనసు రాదు. పూర్తిగా సున్నా వడ్డీ అనే పథకం తీసేసి, ఆసరా, చేయూత అనేపథకాలన్నీ పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితి.
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.3,746 కోట్లు బకాయిలు పెట్టింది. సంవత్సరానికి రూ.4 వేల కోట్లు కావాలి. అలాంటిది రెండేళ్లలోనే రూ.3,746 కోట్లు బకాయి. మళ్లీ ఈ సంవత్సరం మరో రూ.4 వేల కోట్లు కావాలి. దీంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు పూర్తిగా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా.. చంద్రబాబు చేస్తున్న ఘనకార్యం ఏమిటంటే.. వారికి వాళ్ల పేరుతో లోన్ ఇప్పిస్తున్నాడట. లోన్ కోసం 8 శాతం వడ్డీ కూడా కట్ చేస్తా అంటున్నాడు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకపోగా, మాకు లోన్ ఇప్పించడమేంటి స్వామీ.. పైగా దానికి 8 శాతం వడ్డీ కట్ట్టడమేంటీ.. అని నెట్‌వర్క్ ఆస్పత్రులు లబోదిబోమంటూ బోర్డు తిప్పేస్తున్నాయి.


