రోజాపై భానుప్రకాష్‌ వ్యాఖ్యలు అత్యంత హేయం: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Fires On Tdp Mla Bhanu Prakash Comments | Sakshi
Sakshi News home page

రోజాపై గాలి భానుప్రకాష్‌ వ్యాఖ్యలు అత్యంత హేయం: వైఎస్‌ జగన్‌

Jul 19 2025 6:27 PM | Updated on Jul 19 2025 7:57 PM

Ys Jagan Fires On Tdp Mla Bhanu Prakash Comments

సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ వ్యాఖ్యల పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే భానుప్రకాష్‌ని అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రోజాకు సంఘీభావం తెలుపుతూ వైఎస్‌ జగన్‌ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. టీడీపీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకూ ఓర్చుకోలేక, నా సోదరి రెండుసార్లు ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ పని చేసిన ఆర్కే రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తమను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనం. వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు..

..నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి, దుష్ప్రచారం చేసే ఆయన ఉన్నత పదవి పొందారు. అప్పటి నుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్‌గా మారింది. ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మూయించడానికి నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు, విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ కోవలోనే గత ఏడాది కాలంగా అనేక మంది మహిళా నాయకురాళ్లను వారు దారుణంగా వేధించారు.. అవమానించారు’’ అంటూ వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి ఆర్కే రోజా వెళ్లగా, వాస్తవాలు స్పష్టంగా కళ్లెదుటే కనిపిస్తున్నా పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది? టీడీపీ గుండాలను రక్షించేందుకు వారు ఏ స్థాయిలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని మర్చి వ్యవహరిస్తున్నారన్నది చూపుతున్నాయి.

నిజానికి ఒక్క రోజా విషయంలోనే కాదు.. మాజీ మంత్రి విడదల రజని, కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారికతో పాటు, మా పార్టీకి చెందిన పలువురు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. వారికి కనీస గౌరవ, మర్యాదలు దక్కడం లేదు. వారికి ఏ విధంగానూ న్యాయం జరగడం లేదు. ఇకనైనా మాజీ మంత్రి ఆర్కే రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్‌ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement