సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు
మొక్కజొన్న కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకపోయినా ఎవరూ ప్రశ్నించకూడదా?
శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తే బీపీ ఎందుకు చంద్రబాబూ?
మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా?
నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు పెట్టించడం దారుణం కాదా?
దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు?
ప్రజలు దీన్ని ఎల్లకాలం సహించరని అధికారమదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తించుకోవాలంటూ హెచ్చరిక
ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ గళం విప్పుతూనే ఉంటుంది.. నిరంతరం వారికి అండగా ఉంటామని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: మొక్కజొన్న రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లెకు ఎవరు వెళ్తున్నా పోలీసులతో దాడులు చేయించి అరెస్టులు చేస్తారా? అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? అని నిలదీశారు. మీరే దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజలు దీన్ని ఎల్లకాలం సహించరని అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తించుకోవాలంటూ హెచ్చరించారు. మీ అక్రమాలు, అణచివేతలు, కక్ష సాధింపులపై మా పోరాటం ఆగదు చంద్రబాబూ..! ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ ఎప్పటికీ గళం విప్పుతూనే ఉంటుంది.. నిరంతరం ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేస్తూ వైఎస్ జగన్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఆదివారం పోస్టు చేశారు.
అందులో ఆయన ఏమన్నారంటే..
⇒ చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. దీన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారు.
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజిక వర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్‌బాబు, పీట నాగమోహన్‌కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం.
⇒ జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు
ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్ ఎందుకు చూపిస్తున్నారు?
⇒ మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400– రూ.1,600 కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్‌లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా దీన్ని ఎవరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి అరెస్టులు చేస్తారా?
⇒ మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ.నాగేశ్వర్‌పై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పారీ్టల మీదా విమర్శలు, అన్ని వార్తాంశాల మీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్ చేశారు చంద్రబాబూ!
⇒ చంద్రబాబు గారూ.. మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలిం.. ప్రజలు దీన్ని ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, అణచివేతలు, కక్ష సాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది


