వైఎస్ జగన్‌కు తన ఆవేదనను తెలియజేస్తున్న సుగాలి ప్రీతి తల్లి పార్వతి
ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ తరఫున న్యాయసహాయం
2017లో బాబు హయాంలోనే ప్రీతిపై హత్యాచారం
మా ప్రభుత్వం వచ్చాక తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశాం
కుటుంబానికి సాంత్వనగా 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం
తాజాగా మరోసారి ప్రీతి తల్లిదండ్రులు నన్ను కలిశారు.. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టికరణ
సాక్షి, అమరావతి: సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు సర్కారు చూపిస్తున్న నిర్లక్ష్యం ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో బలమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో సీబీఐతో దర్యాప్తు చేయాల్సిందిపోయి.. తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని సీబీఐ వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.
‘ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం అని భరోసా ఇచ్చాను’ అంటూ ‘ఎక్స్’లోని తన ఖాతాలో మంగళవారం వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
బాబు సర్కారు మౌనం
‘‘సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం.
అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం. కానీ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది.
పెన్షన్ తీసేయడం బాధాకరం
ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్‌ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన సిట్ రిపోర్టు, అప్పట్లో చేసిన సీడీఎఫ్‌డీ ల్యాబ్ రిపోర్టులు, డీఎన్‌ఏ ప్రొఫైల్‌లో ఉన్న వివరాలను సైతం చూపించారు.
మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో సీబీఐతో ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని సీబీఐ చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? ఇవాళ(మంగళవారం) న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు తోడుగా ఉంటానని చెప్పాను. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం.’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.


