గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హత లేదా? | YS Jagan Fires Babu Govt For Inappropriate Behavior Towards Tribal Women Leaders, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హత లేదా?

Sep 1 2026 11:24 PM | Updated on Sep 2 2026 11:09 AM

YS Jagan Fires babu Govt For inappropriate behavior towards tribal women leaders

విశాఖ మారికవలసలోని గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాల తరలింపు ఆలోచన విరమించుకోండి

చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపాటు  

విద్యార్థులు, తల్లిదండ్రులకు బాసటగా నిలిచిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దమనకాండ సరికాదు

మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మీద అనుచిత ప్రవర్తనకు తెగబడతారా? 

చంద్రబాబూ.. మీరు, మీ సుపుత్రుడి తలతిక్క పనులతో విద్యాశాఖ అస్తవ్యస్తం

సాక్షి, అమరావతి: విశాఖపట్నం మారిక వలసలోని గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాల తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గిరిజన విద్యార్థులను వారికి నచ్చిన చోట చదువుకోనివ్వాలని హితవు పలికారు. ఈ పాఠశాల తరలింపునకు నిరసనగా విద్యార్థులు, తల్లిదండ్రులకు బాసటగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులపై దమనకాండకు పాల్పడడం సరికాద­న్నారు. 

‘తల్లిదండ్రుల పోరాటానికి మద్దతుగా నిలిచేందుకు వస్తున్న మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మీద అనుచిత ప్రవర్తనకు తెగబడతారా? పోలీసు బలంతో వారి గొంతు నొక్కేయడానికి ఈ స్థాయికి దిగజారు­తారా? ఎక్కడికక్కడ వైఎస్సార్‌­సీపీ నాయకులను గృహ నిర్బంధం చేస్తారా? వారు చేసిన తప్పేమిటి?’ అని నిలదీశారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

వైఎస్సార్‌ హయాంలోనే గురుకులాలు ఏర్పాటు
‘విశాఖపట్నం మారిక వలస వద్దనున్న గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను తరలించవద్దంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు బాసటగా నిలిచి, వారి తరఫున గొంతెత్తడం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడమే వారు చేసిన నేరమా? ప్రభుత్వం, పోలీసుల తీరును తీవ్రంగా ఖండి­స్తున్నా. మారిక వలస స్కూల్‌ తరలింపును వ్యతిరేకిస్తూ ఆగస్టు 20 నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నా, వారి అభ్యంతరాలను వినే ఓపిక ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అసలు ఈ ట్రైబల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? 

వైఎస్సార్‌ హయాంలో ప్రముఖ విద్యావేత్త, అప్పటి ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సలహాలు, సూచనలతో దేశంలోనే ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీ, ఐఐటీ లాంటి విద్యాసంస్థల్లో ఎస్టీ విద్యార్థులు ప్రవేశం పొందేలా స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కింద 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు నాణ్యమైన బోధన అందించేలా ఏడు గురుకులాలను ఏర్పాటు చేశారు. క్వాలిఫైడ్‌ టీచర్స్‌ను పెట్టి, ఈ టీచర్లకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చి వారి ద్వారా మంచి శిక్షణ ఇప్పించడం వల్ల గిరిజన విద్యార్థులు ఆయా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందారు.

మా హయాంలో ఎన్నో సౌకర్యాలు సమకూర్చాం 
మా ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ద్వారా వీటిలో మరిన్ని సౌకర్యాలను సమకూర్చి, మరింత అభివృద్ధి చేయడమే కాకుండా ఆన్‌లైన్‌ కోచింగ్, ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫామ్స్‌ ద్వారా వారికి అందించే బోధనను మరింత మెరుగుపర్చాం. మంచి ఫలితాలను కూడా సాధించాం. ఎన్‌ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందే గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.40 వేలతో పాటు వారికి ల్యాప్‌ట్యాప్‌లు కూడా ఇచ్చాం. ఇప్పుడు వీటన్నింటినీ పట్టించుకోకుండా బాగా నడుస్తున్న పాఠశాలల్లో విద్యార్థులను బలవంతంగా తరలించి ఎందుకు వారిని కష్టపెడుతున్నారు? విశాఖ లాంటి నగరంలో గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హత లేదా? నెల్లూరు జిల్లాలోని కోటలో కూడా ఎస్సీ గురుకులం నుంచి వందల మంది విద్యార్థులను విద్యా సంవత్సరం మధ్యలోనే హడావిడిగా తరలించేశారు.

గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?
మొత్తం 4 గురుకులాల నుంచి దాదాపు 2 వేల మందికి పైగా విద్యార్థులను ఇబ్బంది పెడు­తూ, వారిని చెల్లాచెదురు చేసేశారు. విద్యార్థుల జీవితా­లతో చెలగాటం ఆడుకుంటారా? చంద్రబాబూ.. మీరు, మీ సుపుత్రుడి తలతిక్క పనులతో విద్యాశాఖను అస్తవ్యస్తం చేస్తున్నారు. మీరు పెడతామంటున్న కొత్త వాటిలో ఇంటర్మీడియట్‌ నుంచి ప్రత్యేక శిక్షణ అంటున్నారు. 

కానీ జేఈఈ, నీట్‌ లాంటి పోటీ పరీక్షల్లో రాణించాలంటే ఆ పరీక్షలు రాసే వారికి పునాది కనీసం 8వ తరగతి నుంచే ఉండాలి కదా? అలాంటి కాన్సెప్ట్‌తో పెట్టిన స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌­లను నిర్వీర్యం చేయడం సరికాదు. ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయా­న్ని పునఃసమీక్షించుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యంతరాలను విని, ఆ పిల్లలకు నచ్చిన చోట చదువుకోనివ్వండి. గిరిజన మహిళా నాయకుల పట్ల మీ అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పండి’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement