
తిరుమలలో 2 వేల నిఘా నేత్రాలున్నా పర్యవేక్షణ శూన్యం
ఏదీ పట్టనట్టు వ్యవహరిస్తున్న టీటీడీ విజిలెన్స్
రోజుకో ఘటన వెలుగు చూస్తున్నా చర్యలు నిల్
తాజాగా డ్రోన్‌తో కొండపైకి వచ్చిన ఓ యూట్యూబర్
సంకీర్తన మండపం వద్ద దర్జాగా కూర్చొని ఎగరవేత
శ్రీవారి ఆలయం, మాడ వీధులు, అఖిలాండం చిత్రీకరణ
తీరిగ్గా 12 నిమిషాల అనంతరం గుర్తించిన వైనం
ఆలోగా జరగరానిది ఏదైనా జరిగి ఉంటే.. అని భక్తుల ఆందోళన
మొన్న ఎగ్ బిర్యానీ, నిన్న మద్యం హల్‌చల్.. నేడు ఇలా..
తనిఖీలు, భద్రత, కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరు మాటలకే పరిమితమని విమర్శలు
తిరుమల : కలియుగ దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో నిఘా వ్యవస్థ నిద్దరోతోంది. విరామం లేకుండా దర్శనాలతో స్వామి వారికి మాత్రం కంటి మీద కునుకు లేకపోగా, భద్రతా యంత్రాంగం మాత్రం నిద్ర మత్తులో జోగుతోంది. నిత్యం భక్త జన సందోహంంతో ఉండే ఏడు కొండలపై భద్రత కరువైందని తాజాగా డ్రోన్ ఘటన నిరూపించింది. వరుస ఘటనలతో అభాసుపాలవుతున్నా సమర్థించుకోవడం.. ఎదురు దాడి చేయడం తప్ప పాలకులు గుణపాఠం నేర్వడం లేదు.
నిఘా వైఫల్యాలు టీటీడీ అధికారులకు తల నొప్పులు తెచ్చి పెడుతున్నాయి. మూడంచెల భద్రత నడుమ తిరుమల మొత్తం నిఘా నీడలో ఉంటుంది. టీటీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్, స్టేట్ పోలీస్, అక్టోపస్‌తోపాటు పలు విభాగాలు తిరుమలలో పహారా కాస్తున్నాయి. ప్రత్యేకంగా 2 వేల సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిసూ్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పసిగట్టే అనాలిటిక్స్ కలిగిన అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది.
శ్రీవారి ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు, వివిధ సముదాయాల వద్ద అత్యంత నాణ్యతగా చిత్రీకరించే అధునాతన నిఘా కెమెరాలను అమర్చారు. దీంతో గతంలో ఎలాంటి సమాచారం అయినా టీటీడీ నిఘా విభాగం, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సెకండ్ల వ్యవధిలో విజిలెన్స్ విభాగానికి చేరేది. దొంగతనాలు, మిస్సింగ్స్ ఇలా అనేక ఘటనలను సులభంగా గుర్తించి నిమిషాల వ్యవధిలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా క్రియాశీలక పాత్ర పోషించేది నిఘా వ్యవస్థ. అలాంటి వ్యవస్థకు ఏమైందో ఏమోగానీ పది నెలలుగా మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తోందని వరుసగా జరుగుతున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
తాజాగా డ్రోన్ కలకలం
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్ తరెజా అనే ఓ యూట్యూబర్ మంగళవారం సాయంత్రం తిరుమల ఆలయంపై డ్రోన్ ఎగురవేసి తీవ్ర కలకలం సృష్టించాడు. శ్రీహరి ఆలయంపై దాదాపు 10 నిమిషాల పాటు ఎగిరిన డ్రోన్ ద్వారా వివిధ కోణాల్లో చిత్రీకరించాడు. శ్రీవారి ఆలయం మహా ద్వారం మొదలుకొనిం ఆనంద నిలయం వరకు ఏరియల్ వ్యూను చిత్రీకరించాడు. నిత్యం రద్దీగా ఉండే.. అధిక సంఖ్యలో నిఘా నేత్రాలు ఉన్న కళ్యాణకట్ట సమీపంలోని హరినామ సంకీర్తన మండపం వద్ద దర్జాగా కూర్చుని డ్రోన్‌ను ఆపరేట్ చేశారు.
శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగురుతుండటాన్ని గమనించిన భక్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఎవరికి తెలియజేయాలో తోచక చూసూ్తనే ఉండిపోయారు. పైగా దర్శనం కోసం వచ్చినందున వారి వద్ద సెల్ ఫోన్లు కూడా లేవు. ఈ క్రమంలో 12 నిమిషాల అనంతరం శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగురుతున్నట్లు టీటీడీ విజిలెన్స్ ఎట్టకేలకు గుర్తించింది. హుటాహుటిన అక్కడికి వెళ్లిన భద్రత సిబ్బంది డ్రోన్‌తో సహా తరెజాను అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, 2 వేల కెమెరాలతో నిఘా ఉన్నా, వందల సంఖ్యలో శ్రీవారి ఆలయం చుట్టూ విజిలెన్స్ పహారా ఉన్నా, అంత సేపటి వరకు డ్రోన్ ఎగురుతుండటాన్ని గుర్తించకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇటీవల ఎగ్ బిర్యానీ, మద్యం తాగి ఓ యువకుడు హల్‌చల్ చేసిన వ్యవహారం మరిచిపోక ముందే ఇప్పుడీ డ్రోన్ కలకలం రేపింది.
‘ఇంత పటిష్ట యంత్రాంగం, భద్రత ఏర్పాట్లు ఉన్నప్పటికీ 12 నిమిషాల పాటు శ్రీవారి ఆలయాన్ని ఓ యువకుడు డ్రోన్‌తో చిత్రీకరించడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆలోగా జరగరానిది ఏదైనా జరిగి ఉంటే.. అని తలుచుకుంటేనే భయమేస్తోంది. లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు, తొక్కిసలాట, తరచుగా అపచారాలు.. ఎందుకిలా’ అని పలువురు భక్తులు వాపోయారు.
అలిపిరి వద్ద చెక్ చేయలేదా?
సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తుల బ్యాగులను, వ్యక్తులను అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీ చేసి పంపుతారు. బ్యాగులను స్కానింగ్ చేసి అందులో నిషేధిత వస్తువులు ఉంటే వాటిని గుర్తించి, తొలగించి పంపుతారు. అయితే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యూట్యూబర్ అన్షుమన్ తరేజా తిరుమలకు తనతో పాటు డ్రోన్‌ను ఎలా తెచ్చుకున్నాడనే ప్రశ్న తలెత్తుతోంది.