అయ్యో పాపం.. నీళ్లు అనుకొని యాసిడ్‌ తాగిన యువకుడు

Young Man Drink Acid Instead Water Accidently Vijayawada - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: ఓ డిగ్రీ విద్యార్థి మంచినీళ్లని అనుకుని ఫ్రిజ్‌లో ఉన్న యాసిడ్‌ తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చిచిత్స పొందుతున్నాడు. ఈ ఘటన విజయవాడరూరల్‌ మండలం ఎనికేపాడులో ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నాగాయలంకలో కోసూరి రామాంజనేయులు, రామతులసి దంపతులు నివసిస్తున్నారు. వారి కుమారులు చైతన్య, సతీష్‌. రామాంజనేయులు నాగాయలంక పంచాయతీ కార్యాలయం పక్కన బడ్డీకొట్టులో చెప్పుల షాపు నిర్వహిస్తూ కుమారులను చదివిస్తున్నారు. విజయవాడ లయోల కళాశాల ఏవియేషన్‌ విభాగంలో చైతన్య డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

ఇంటర్‌షిప్‌ నిమిత్తం తోటి విద్యార్థులతో కలిసి కేసరపల్లిలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ నెల 14వ తేదీన స్నేహితులతో కలిసి వాలీబాల్‌ ఆడేందుకు చైతన్య ఎనికేపాడు వచ్చాడు. ఆట ముగిశాక దాహం తీర్చుకునేందుకు సమీపంలోని ఓ ఫ్యాన్సీ జనరల్‌ స్టోర్స్‌కు వెళ్లాడు. మంచినీళ్ల బాటిల్‌ కావాలని అడిగారు. దుకాణం యజమాని ఫ్రిజ్‌లో ఉన్న బాటిల్‌ తీసుకోవాలని సూచించాడు. అయితే ఆ ఫ్రిజ్‌లో పొర పాటున యాసిడ్‌ బాటిల్‌ కూడా ఉంది.

కూలింగ్‌తో ఉన్న ఆ యాసిడ్‌ బాటిల్‌ను వాటర్‌బాటిల్‌ అనుకుని చైతన్య దానిని తీసుకుని తాగాడు. వెంటనే నురగలు కక్కుకుంటూ వాంతి చేసుకోవడంతో స్నేహితులు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలో మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన చైతన్య ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న విజయవాడ పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: కాలం ఎంతగామారింది.. తాచేరు వయా ‘ఫోన్‌ పే’మెంట్‌!

న్యాయం కోసం తల్లిదండ్రుల వినతి 
మరి కొన్ని నెలల్లో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేసి తమకు అండగా ఉంటాడనుకున్న కుమారుడు దుకాణదారుడి నిర్లక్ష్యం కారణంగా  మృత్యువుతో పోరాడుతున్నాడని, తమకు న్యాయం చేయాలని రామతులసి, రామాంజనేయులు దంపతులు వేడుకుంటున్నారు. ఇప్పటికే రూ.లక్షకు పైగా ఖర్చుచేసి వైద్యం చేయించామని పేర్కొన్నారు. యాసిడ్‌ తాగడంతో లోపల అవయవాలు దెబ్బతిన్నాయని, శస్త్ర చికిత్స చేయాల్సివస్తే రూ.లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెబుతున్నారని వివరించారు. అయితే తమకు అంత ఖర్చు భరించే పరిస్థితి లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top