టీడీపీ నేతలు, సీఐ వేధింపులతో యువకుడు ఆత్మహత్యాయత్నం | Young Man Attempts Suicide Due to Harassment by CI | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలు, సీఐ వేధింపులతో యువకుడు ఆత్మహత్యాయత్నం

Apr 29 2026 5:46 AM | Updated on Apr 29 2026 5:46 AM

Young Man Attempts Suicide Due to Harassment by CI

కర్నూలు ఆస్పత్రిలో చికిత్స 

గిద్దలూరు రూరల్‌: దాయాదితో ఉన్న స్థల వివాదంలో టీడీపీ నేతల ప్రోద్బలంతో సీఐ తనను వేధిస్తున్నాడంటూ మార్కాపురం జిల్లా గిద్దలూరుకు చెందిన యల్లా మణికంఠ (35) మంగళవారం పొలాల్లోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన మరణానికి సమీప బంధువులు యల్లా శ్రీనివాసులు, యల్లా రమేష్, గోపీ వారికి మద్దతుగా ఉన్న టీడీపీ నేతలు పాలుగుళ్ల చిన్నశ్రీనివాసరెడ్డి, దిలీప్‌కుమార్‌తో పాటుగా సీఐ సురేష్‌ కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

సెల్ఫీ వీడియోలో బాధితుని కథనం మేరకు.. ‘నాకు, నా దాయాది అయిన యల్లా శ్రీనివాసులుకు మధ్య స్థానిక గర్రెవారి వీధిలో ఉన్న 3 సెంట్ల స్థలం విషయంలో ఉన్న వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. నా బంధువులు టీడీపీ నేత చిన్న శ్రీనివాసరెడ్డికి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి అతడి ద్వారా దిలీప్‌కుమార్, మరికొంతమంది ఇటీవల ఆ స్థలంలో రెండుసార్లు కట్టడాలు దౌర్జన్యంగా నిర్మించేందుకు చూశారు. వారిని 

ఆ స్థలంలోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చాను. ఈనెల 23న  దిలీప్‌కుమార్, మరికొందరు నాపై దాడికి పాల్పడ్డారు. పోలీసులను ఆశ్రయిస్తే రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా ఇద్దరిపై కేసులు నమోదు చేశామని చెప్పారు.  ఈ విషయమై న్యాయం చేయమని ఎస్పీ హర్షవర్ధన్‌రాజును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఎస్పీని కలిసినా.. తిరిగి నీకు న్యాయం చేయాల్సింది నేనే అంటూ సీఐ సురేష్‌ నన్ను కించపరిచి మాట్లాడుతున్నాడు.

ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పురుగుల మందు తాగుతున్నాను’ అంటూ వీడియో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న బంధువులు మణికంఠను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఈ విషయమై సీఐ సురేష్ను వివరణ కోరగా గర్రెవారి వీధిలో స్థలం డాక్యుమెంట్లు మణికంఠ పేరుపై లేవని, కోర్టు ఎలా చెప్తే అలా వెళ్లామే తప్ప అతడిపై దురుసుగా ప్రవర్తించలేదన్నారు. కాగా, మణికంఠ (35)కు ఏడాది క్రితం వివాహమైంది. భార్య ప్రస్తుతం గర్భవతి.

Advertisement
 
Advertisement
Advertisement