ఉచిత బస్సు కావాలని ఎవరు అడిగారు?
ఉల్లి సాగుచేసి నాశనమయ్యాం
ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
రైతుల పరిస్థితి అధ్వాన్నం
50 ఏళ్లకే పింఛన్ ఏమైంది?
కర్నూలు జిల్లా వెల్దుర్తిలో మహిళ ఫైర్
కర్నూలు (అగ్రికల్చర్): ‘ఉచిత బస్సు కావాలని ఎవరడిగారు. ఉల్లి సాగుచేసి నాశనమయ్యాం. క్వింటాలు ఉల్లిని రూ.200కు అడుగుతున్నారు. రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. రైతులను పట్టించుకునే వారు లేరు. 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్నారు. ఇంతవరకు కొత్త పింఛన్‌లే లేవు. ఉచిత బస్సు ప్రయాణం వద్దు. టికెట్ ఇవ్వండి’ అంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ టికెట్ తీసుకున్నారు.
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న కొట్టాల గ్రామానికి చెందిన సుంకులమ్మ వెల్దుర్తి మండలంలోని బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వెల్దుర్తిలో బస్సు ఎక్కి చిన్నటేకూరుకు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు. టికెట్ తీసుకునే సమయంలో ఉచిత బస్సు వద్దని, రైతుల్ని ఆదుకోవాలని ఆమె నినాదాలు చేశారు.


