సాక్షి,కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన 19 మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు కర్నూలు వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగంలో జరిగాయి. ఇప్పటి వరకు డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయిన మొత్తం మృతదేహాల రిపోర్ట్ వివరాల్ని వైద్యులు ఎస్పీకి అందించారు.
వాటి ఆధారంగా అధికారులు భౌతిక కాయల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేలా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 14 మృత దేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో బిహార్ చెందిన ఆర్గా అనే వ్యక్తి మృతదేహానికి వారి కుటుంబ సభ్యులు కర్నూలు జోహరాపురంలో అంత్యక్రియలు చేశారు. బిహార్‌కు తీసుకుని వెళ్లేందుకు సమయం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో అక్కడ అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు బస్సు ప్రమాదంలో ఇంకా రెండు మృతదేహాల డిఎన్ఎ రిపోర్టు అందాల్సి ఉండగా.. ఇప్పటి దాకా 17 మృతదేహాల డీఎన్‌ఏ రిపోర్ట్‌లను అధికారులు పొందారు. ఈ రోజు రాత్రికి 19 మృతదేహాల్లో 18 మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. తమిళనాడుకు చెందిన మృతుడు ప్రశాంత్ కుటుంబ సభ్యులు రేపు కర్నూలుకి రానున్న నేపద్యంలో ఆ మృత దేహాన్ని రేపు అప్పగించనున్నారని సమాచారం.


