మృతి చెందిన త్రిమూర్తి (ఫైల్)
డీఎన్‌ఏ రిపోర్టులు రావడంతో మృతదేహాలు అప్పగింత
కుటుంబ సభ్యుల అభ్యర్థనతో బిహార్‌వాసి అమృత్‌కుమార్‌కు కర్నూలులోనే అంత్యక్రియలు
ఆరాంఘర్‌లో ఎక్కిన ప్రయాణికుడు కుప్పానికి చెందిన త్రిమూర్తిగా గుర్తింపు
మృతుల కుటుంబాలకు పరిహారం చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కావేరి బస్సు ప్రమాద ఘటనపై చిక్కుముడి వీడింది. బైక్, బస్సు ప్రమాదం ఒకటి కాదని.. రెండు వేర్వేరు ప్రమాదాలని పోలీసులు తేల్చారు. బైకర్స్ మద్యం సేవించి లక్ష్మీపురం నుంచి బయలుదేరగా చిన్నటేకూరు దాటిన తర్వాత వారి బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శివశంకర్ అక్కడికక్కడే మృతిచెందగా, వెనుక కూర్చున్న ఎర్రిస్వామి కిందపడిపోయాడు. ఈ ఘటన తర్వాత కొన్ని వాహనాలు ఇదే దారిలో వెళ్లాయి. 13 నిమిషాల తర్వాత వచి్చన కావేరి బస్సు డ్రైవర్.. ఆ బైక్‌ను గుర్తించడంలో విఫలమై ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది.
నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ నెల 24న బైక్‌ను ఢీకొట్టి ప్రమాదానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుపై సెక్షన్ 12(ఏ), 106(1) బీఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఏ1గా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా బస్సు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణలో రెండూ వేర్వేరు ఘటనలని తేలాక ఈ నెల 25న మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. చాకలి ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు మృతిచెందిన బైకర్ శివశంకర్‌పై సెక్షన్ 281, 125(ఏ), 106(1) కింద కేసు నమోదు చేశారు. విచారణ ఇంకా కొనసాగుతోందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
మృతదేహాలు అప్పగింత
డీఎన్‌ఏ శాంపిల్స్ రిపోర్ట్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ) జిల్లా కలెక్టర్‌కు పంపడంతో మృతదేహాలను బాధిత కుటుంబాలకు అందజేశారు. కర్నూలు జనరల్ ఆస్పత్రి మార్చురీ వద్ద భీతావహ వాతావరణంలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఆదివారం 17 మృతదేహాలను బంధువులకు అప్పగించగా.. బిహార్ వాసి అమృత్‌కుమార్ మృతదేహాన్ని తాము తీసుకెళ్లలేమని, ఆనవాళ్లు కూడా లేని మాంసపు ముద్దకు ఇక్కడే అంత్యక్రియలు చేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. దీంతో కర్నూలు కార్పొరేషన్ అధికారులు అమృత్‌కుమార్ అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇక తమిళనాడు వాసి ప్రశాంత్ మృతదేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
ఆరాంఘర్‌లో బస్సు ఎక్కింది కుప్పం వాసి త్రిమూర్తి..
హైదరాబాద్‌లోని ఆరాంఘర్‌లో బస్సు ఎక్కిన ప్రయాణికుడిని కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం యామగానిపల్లెకు చెందిన త్రిమూర్తిగా గుర్తించడంతో డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
చెక్కుల పంపిణీ పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం
బస్సు ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురు ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందజేసింది. గద్వాల ఆర్డీవో అలివేలు చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున హోంమంత్రి అనిత ప్రకటించినట్లుగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని త్వరలో అందజేస్తామని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు.
కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితుడు
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన గుణసాయి అనే ప్రయాణికుడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోలుకుంటున్నాడు. మచిలీపట్నంకు చెందిన ఈయన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బస్సులో ప్రయాణిస్తుండగా మంటలు రావడంతో ఆ పొగ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాయి. దీంతో అతన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్‌ఐసీయులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. శనివారం వరకు విషమంగా ఉన్న అతని ఆరోగ్యం వైద్యుల కృషి ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడింది.
ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి..
బస్సు ప్రమాదంలో కీలక సాక్షిగా ఉన్న ఎర్రిస్వామి శనివారం రాత్రి ప్రభుత్వాస్పత్రిలో కడుపునొప్పితో చేరాడు. బైక్ నుంచి అతను కింద పడటంతో కడుపు వద్ద గీరుకుపోయింది. దీనికితోడు పలుచోట్ల నొప్పులు ఉండటంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేరి్పంచారు. అతనికి అ్రల్టాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేసిన వైద్యులు.. లోపల ఎలాంటి గాయాల్లేవని నిర్ధారించారు. మరికొన్ని పరీక్షలు చేసి కోలుకుంటే డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిసింది.


