పోరాడి ఓడింది..!

Woman Deceased in Fire Accident After Battle 88 Days in Hospital - Sakshi

మాచవరం విద్యుత్‌ ప్రమాద ఘటనలో ఆసుపత్రిలో చేరిన మహిళ 

మృత్యువుతో పోరాడి 88 రోజులు అనంతరం మరణం  

నాగులుప్పలపాడు: మాచవరం విద్యుత్‌ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలతో 88 రోజుల కిందట ఒళ్లంతా కాలిన స్థితిలో ఆసుపత్రిలో చేరిన కాకామాను భాగ్యవతి (35) బతకాలని కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు ఫలిస్తాయన్నట్లు గత 10 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కాస్త కోలుకున్నట్లు, తెలివిగా ఉండటంతో అంతా సంతోషం అనుకున్నారు. ఇంతలోనే విధి వక్రించి ఆదివారం మధ్యాహ్నం ఆమె ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. వివరాల్లోకి వెళ్తే.. మే 14వ తేదీన రాపర్ల గ్రామ పొలాల్లో మిర్చి కోతకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ట్రాక్టర్‌ ఎక్కి వస్తుండగా డొంకకు ఆనుకొని ఉన్న విద్యుత్‌ స్తంభం ట్రాక్టర్‌ డోరుకు బలంగా తగిలి కరెంటు తీగలు ట్రాక్టర్‌లోని కూలీలపై పడ్డాయి.

ఈ సంఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించడంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌తో పాటు కాకుమాను నాగమణి కాలిన గాయాలతో ఉన్నారు. వీరి ఇరువురిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ట్రాక్టర్‌ డ్రైవర్‌ అదే రోజు రాత్రికి మరణించాడు. కాకుమాను భాగ్యవతి మాత్రం ఆ రోజు నుంచి కొన ఊపిరితో కొట్టుకుంటూ చికిత్స పొందుతుంది. అయితే 10 రోజుల కిందట నుంచి కాస్తంత కోలుకున్నట్లు తెలివిగా ఉండటంతో కుటుంబ సభ్యులలో బతుకుతుందేమో అన్న కొంత ఆశ కలిగింది. ఆ ఆశలను నీరుగారుస్తూ ఆదివారం మధ్యాహ్నం ఒంగోలు ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచింది. మృతురాలుకి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడి వయస్సు మూడేళ్లు ఉంటుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top