ఉచితంగా వృత్తి విద్యా కోర్సులు | Vocational courses for free in AP | Sakshi
Sakshi News home page

ఉచితంగా వృత్తి విద్యా కోర్సులు

Jan 16 2021 5:18 AM | Updated on Jan 16 2021 5:18 AM

Vocational courses for free in AP - Sakshi

సాక్షి, అమరావతి: విద్యార్థులలో ఆధునిక సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ద్వారా పరిశ్రమలు, ఇతర సంస్థల అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వారికి ఆధునిక నైపుణ్య కోర్సులను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీ (నాస్కామ్‌)ల సహకారంతో వృత్తివిద్య, నైపుణ్య సర్టిఫికెట్‌ కోర్సులను అందించనుంది. విద్యార్థులే కాకుండా ఆయా వర్సిటీల పరిధిలోని కాలేజీల అధ్యాపకులకూ వీటిని నేర్పిస్తారు. ఇటువంటి కోర్సులు ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం విశేషం. సీఎం వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు ఈ కోర్సులను ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా అందించనున్నారు. ఇటీవల ఉన్నత విద్యామండలి ఆయా సంస్థల నిపుణులతో సమావేశమై ఈ ఆన్‌లైన్‌ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఉన్నత విద్యా మండల చైర్మన్‌ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ అలయెన్స్‌ ఫర్‌ టెక్నాలజీ–ఎన్‌ఈఏటీ (ఏఐసీటీఈ అనుబంధ విభాగం) కోఆరి్డనేటర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ బుద్ధా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, డాక్టర్‌ సంధ్య చింతల, అడోబ్‌ ప్రతినిధి గరిమా, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్లు కె.రామ్మోహనరావు, టి.లక్ష్మమ్మ తదితరులు వీటిపై చర్చించి కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు.

ఆన్‌లైన్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు ఇవీ..
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, బిగ్‌డేటా విశ్లేషణ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్, వెబ్‌ మొబైల్‌ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, వర్చువల్‌ రియాలిటీ, 3డీ ప్రింటింగ్‌.

సాంకేతిక నైపుణ్య కోర్సులు..
ప్రాబ్లెమ్‌ సాల్వింగ్, డిజైన్‌ థింకింగ్, నిరంతర అభ్యాసం, ప్రాజెక్ట్‌ నిర్వహణ, చర్చలు.. ప్రభావం.. సహకారం, ఉత్పత్తి నిర్వహణ, ప్రోగ్రామ్‌ నిర్వహణ, డిజిటల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ కమ్యూనికేషన్, స్టోరీ టెల్లింగ్‌

ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు
ఈ కోర్సులన్నింటినీ విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీల అధ్యాపకులు, విద్యార్థులకు అందించనున్నారు. దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు.  ‘హెచ్‌టీటీపీఎస్‌://ఎల్‌ఐఎఫ్‌ఈఎస్‌కేఐఎల్‌ఎల్‌ఎస్‌పీఆర్‌ఐఎంఈ.ఐఎన్‌’ లో లాగిన్‌ అయి అధ్యాపకులు, విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. నేరుగా తమ గూగుల్‌ అకౌంట్‌ ద్వారా వెబ్‌పేజీలోని ఆయా కోర్సులను క్లిక్‌ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లోనే వాటిని నేర్చుకోవచ్చు. అయితే, ప్రతి కోర్సులోనూ వారి అభ్యసన ఫలితాలను, నైపుణ్యాలను గుర్తించేందుకు తుది పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. అభ్యసన సమయంలో అభ్యాసకుడికి సహాయపడేందుకు ‘మై గైడ్‌’ ఆప్షన్‌ కింద నిపుణుడైన అధ్యాపకులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ఏఐసీటీఈ, నాస్కామ్‌లు ధ్రువీకరణతో సర్టిఫికేట్లు ఇస్తారు. ప్రతి కోర్సుకు నిర్దేశిత కాలం ప్రకారం వారి సాధించిన నైపుణ్యాలు, ప్రమాణాల ఆధారంగా క్రెడిట్లు ఇస్తారు. ఈ క్రెడిట్లు వారి రెగ్యులర్‌ కోర్సులకు కలిసేలా అవకాశం కల్పిస్తున్నారు. తద్వారా విద్యార్థుల అకడమిక్‌ క్రెడిట్లు మరింత పెరిగేందుకు ఆస్కారమేర్పడుతుంది. ఈ కోర్సులకు అభ్యర్థులు ఈ ఏడాది జూన్‌ 21 వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

సీఎం ఆదేశాలతో ముందడుగు
విద్యార్థులలో వివిధ ఆధునిక సాంకేతక నైపుణ్యాలను పెంచేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఉన్నత విద్యామండలి ఈ కోర్సుల ద్వారా ముందడుగు వేస్తోంది. డిమాండ్‌ ఉన్న అంశాలలో నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగాల సాధన మరింత సులభమవుతుంది.
– ప్రొ. కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement