
మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలను చంపేందుకే జనసేన కార్యకర్తలు దాడులు చేశారని..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం వద్ద జనసేన కార్యకర్తలు శనివారం వీరంగం సృష్టించారు. మంత్రులను, వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. విశాఖ గర్జన ర్యాలీని ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాంతో ఎయిర్‌పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై విశాఖ సీపీ ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా.. విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద అనుమతిలేకుండా 300 మంది వరకు జనసేన నేతలు గుమిగూడారు. మంత్రి రోజాతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలను అగౌరపరిచే పదజాలంతో దూషించడమే కాకుండా చంపాలనే ఉద్దేశంతోనే దాడి చేశారు. ప్రజాశాంతికి భంగం వాటిల్లడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ రూల్స్ అతిక్రమించారు.
పెందుర్తి ఎస్‌హెచ్‌వో నాగేశ్వరరావు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. మున్నంగి దిలీప్‌కుమార్, సిద్దు, సాయికిరణ్, హరీష్ లాంటి సామాన్య ప్రజలకు గాయాలు చేశారు. జనసేన కార్యకర్తల చర్యలతో విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర ప్రజలు భయభ్రాంతుకు గురయ్యారు. నిర్ణీత సమయంలో విమానాశ్రయానికి చేరుకోలేక 30 మంది ప్రయాణీకులు విమాన ప్రయాణం మిస్ చేసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన జనసేన నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేశాం’ అని ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు, విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘటనలో అరెస్ట్‌ల పర్వం ప్రారంభమైంది. మంత్రులపై దాడి ఘటనలో పోలీసులు.. పలువురు జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేశారు. విశాఖ దాడి ఘటనపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. మంత్రులపై హత్యాయత్నంతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు.