గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతం

Village secretariat system is awesome says Maharashtra Officials - Sakshi

సచివాలయాలవైపు ఇతర రాష్ట్రాల చూపు

అధ్యయనానికి వచ్చిన మహారాష్ట్ర అధికారులు

నేడు, రేపు క్షేత్రస్థాయి పర్యటన.. వలంటీర్ల సేవలపై ఆరా

7 నెలల కిందట రాష్ట్రంలో పర్యటించిన కర్ణాటక అధికారులు

సాక్షి, అమరావతి/విజయవాడ రూరల్‌: ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి సమర్థంగా తీసుకెళుతున్న మన గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల వైపు పలు రాష్ట్రాలు ఆకర్షితమవుతున్నాయి. ఈ వ్యవస్థలను అధ్యయనం చేసేందుకు, తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మారుమూల గ్రామాల్లో సైతం దాదాపు 500 రకాల ప్రభుత్వ సేవలు సచివాలయాల ద్వా రా అందజేస్తున్న విధానాన్ని తెలుసుకునేందుకు మహారాష్ట్ర అధికారుల బృందం బుధవారం నుంచి రాష్ట్రంలో పర్యటిస్తోంది. కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ నేతృత్వంలో అధికారుల బృందం 7నెలల కిందట రాయలసీమలో పర్యటిం చి సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పుణె జిల్లా పరిషత్‌ అధికారులు సుధీర్‌ భగవత్‌ నాయకత్వంలో బుధవారం విజయవాడ రూరల్‌ మండలంలోని ప్రసాదంపాడు గ్రామ సచివాలయం–3ను పరిశీలించారు. అనంతరం అంబాపురంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వానపాముల ద్వారా ఎరువులను తయారుచేసే విధానాన్ని తిలకించారు. చివరిగా గొల్లపూడిలో వెల్‌నెస్‌ సెంటర్‌ను పరిశీలించారు. 

పంచాయతీరాజ్‌ కమిషనర్‌తో భేటీ..
మహారాష్ట్ర అధికారులు బుధవారం పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ఏర్పాటు గురించి కోన శశిధర్‌ వారికి వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు.  కేవలం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి, వాటి  భర్తీ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేశారని వివరించారు. ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకే చేరవేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును కూడా నియమించినట్లు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top