నిరంతర జాబ్‌ మేళాలు 

Vijaya Sai Reddy Comments About Job Mela Andhra Pradesh - Sakshi

నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనే లక్ష్యం: విజయసాయిరెడ్డి 

తిరుపతి, విశాఖలో 30,473 మందికి జాబ్స్‌ 

రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు 

మే 7, 8న గుంటూరు నాగార్జున వర్సిటీలో జాబ్‌ మేళా 

ఇప్పటికే 77 వేల మంది దరఖాస్తు.. పాల్గొంటున్న 148 కంపెనీలు  

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు వచ్చే వరకు జాబ్‌ మేళాలు నిరంతరం నిర్వహిస్తామని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల కో–ఆర్డినేటర్‌ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ మెగా జాబ్‌మేళాల్లో భాగంగా ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నిరుద్యోగుల కోసం మే 7, 8 తేదీల్లో గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న జాబ్‌ మేళా పోస్టర్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు తిరుపతి, విశాఖ, గుంటూరులో మెగా జాబ్‌ మేళాలు నిర్వహించి 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పామన్నారు. తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో నిర్వహించిన జాబ్‌ మేళాలకు అపూర్వ స్పందన లభించిందని, 30,473 మందికి ఇప్పటికే ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. చెప్పిన దానికంటే అధికంగా ఉద్యోగాలు కల్పించడంతో ఓర్వలేని ప్రతిపక్షాలు జాబ్‌ మేళాలపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.  

జాబ్‌మేళాలో 148 కార్పొరేట్‌ సంస్థలు 
జాబ్‌ మేళాల్లో ఉద్యోగాలు పొందిన వారికి విద్యార్హతల ఆధారంగా రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనంతో కార్పొరేట్‌ సంస్థలు నియామక పత్రాలను అందజేశాయని తెలిపారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించే జాబ్‌ మేళా కోసం వెబ్‌సైట్‌ ద్వారా ఇప్పటికే 77 వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా 148 కార్పొరేట్‌ సంస్థలు పేర్లను నమోదు చేసుకున్నాయని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన ద్వారా తలసరి ఆదాయం, పరిశ్రమల ఉత్పాదకత పెరిగి తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి చెందుతుందన్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జలవనరులు, పౌర సరఫరా, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top