3 గంటల్లోనే శ్రీవారి దర్శనం 

TTD Tirumala Srivari Darshanam within three hours - Sakshi

తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారిని శుక్రవారం అర్ధరాత్రి వరకు 63,265 మంది దర్శించుకోగా, స్వామివారికి 31,217 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.3.50 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్టు లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనం 3 గంటల్లోనే లభిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్‌లు నిండి ఉన్నాయి. 

అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫొటోలు నిషేధం 
తిరుమలకు విచ్చేసే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమతాలకు సంబంధించిన ప్రచార సామగ్రి తిరుమలకు తీసుకెళ్లడాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది. టీటీడీ భద్రతా సిబ్బంది అలిపిరి వద్ద అలాంటి వాహనాలను తిరుమలకు అనుమతించరు.

తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా రాహిత్యంతో వ్యక్తుల ఫొటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలు కలిగి ఉన్న ఎడల వాటిని విజిలెన్స్‌ సిబ్బంది వాహనదారులకు వివరించి తీసివేస్తున్నారు. కావున వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

శ్రీవారి వారపు సేవలు తాత్కాలికంగా రద్దు 
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో వేసవిలో సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే వారపు సేవలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. అందులో భాగంగా మంగళవారం నిర్వహించే అష్టదళపాద పద్మారాధన సేవ, గురువారం నిర్వహించే తిరుప్పావడ, శుక్రవారం నిర్వహించే నిజపాద దర్శన సేవలను వచ్చే వారం నుంచి తాత్కాలికంగా టీటీడీ రద్దు చేయనుంది.

ఈ సేవలు రద్దు చేసిన రోజుల్లో కూడా సామాన్య భక్తులకు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే టీటీడీ శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇకపై శుక్రవారం అభిషేక సేవ మినహా మిగిలిన వారపు సేవలన్నీ జూన్‌ 30వ తేదీ వరకు రద్దు చేసినట్లు సమాచారం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top