ఆధార్‌ సేవల్లో మనమే టాప్‌ | Top Aadhaar Enrolment Services in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆధార్‌ సేవల్లో మనమే టాప్‌

Apr 8 2025 6:13 AM | Updated on Apr 8 2025 6:13 AM

Top Aadhaar Enrolment Services in Andhra Pradesh

పలు కేటగిరీల్లో ముందువరుసలో ఆంధ్రప్రదేశ్‌ 

చిన్నారుల ఆధార్‌ నమోదులో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ

అవార్డులను ప్రకటించిన కేంద్రం..

నేడు ఢిల్లీలో పురస్కారాలు అందజేత 

మూడేళ్లుగా సచివాలయాల ద్వారా ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు నిర్వహిస్తున్న గ్రామ వార్డు సచివాలయాల శాఖ

వైఎస్‌ జగన్‌ ముందుచూపునకు మరో నిదర్శనం

సాక్షి, అమరావతి: గత మూడేళ్లగా ప్రతి నెలా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తూ అందజేస్తున్న ఆధార్‌ సేవలకు గుర్తింపుగా కేంద్రం రాష్ట్రానికి అవార్డులు ప్రకటించింది. చిన్న పిల్లలకు కొత్తగా ఆధార్‌ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది. వయోజనుల ఆధార్‌ నమోదు పరిశీలన ప్రక్రియలోనూ ఏపీ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. మంగళవారం ఢిల్లీలో జరిగే ఆధార్‌ సంవిద కార్యక్రమంలో రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల అధికారులు ఆయా కేటగిరీల పురస్కారాలను అందుకోనున్నారు. 

వైఎస్‌ జగన్‌ ముందుచూపు  
2019లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముందుచూపుతో నెలకొల్పిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఎలాంటి సత్ఫలితాలు సాధిస్తుందో ఈ పురస్కారాల రూపంలో లభించిన గుర్తింపు మరోసారి రుజువు చేసింది. 2022 నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సేవలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆధార్‌ సేవలంటే గగనతరంగా మారుతున్న ఆ రోజుల్లో వీటిని అందరికీ చేరువ చేశారు. సమీప సచివాలయాల్లోనే ఆధార్‌ నమోదు, మార్పులు చేర్పులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

మారుమూల ప్రాంతాల్లో సైతం నెల నెలా ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు నిర్వహించారు.  దీంతో రాష్ట్రంలో ఆధార్‌ నమోదులో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. ప్రత్యేకంగా నవజాత శిశువులకు ఆధార్‌ నమోదు చేయడంలో  అగ్రగామిగా నిలిచింది. ఇదే సచివాలయ వ్యవస్థను చిత్తశుద్ధితో ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తే దేశంలోనే కాదు యావత్‌ ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని నిపుణులు, మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement